Space Homes
-
‘నింగిలో నివాసం’.. బెంగళూరు కంపెనీ ప్రయత్నం
బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఆకాశలబ్ధి వినూత్న ప్రయత్నం చేస్తోంది. వ్యోమగాములు, పరిశోధకులు, అంతరిక్ష పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి అంతరిక్షంలో నివాసాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోంది.ఆరు నుంచి 16 మందికి వసతి కల్పించేలా అంతరిక్ష నివాస పరిష్కారాన్ని రూపొందిస్తోంది ఆకాశలబ్ధి. దీనికి సంబంధించిన వివరాలను లింక్డ్ఇన్లో వెల్లడించింది. దీన్ని 'తారల మధ్య ఇల్లు'గా పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 'అంతరిక్ష్ హబ్' పేరుతో ఆవాస నమూనాను ఆకాశలబ్ధి సిద్ధం చేసింది. 'అంతరిక్ష్ హబ్' అనేది విస్తరించదగిన షెల్ వంటి నిర్మాణం. ఇది అసాధారణమైన అంతరిక్ష శిధిలాలు, రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతరిక్షంలో నివాసంతో పాటు బహుళ ప్రయోజనాల కోసం వినియోగించేలా దీని డిజైన్‌ను రూపొందిస్తున్నారు. 'అంతరిక్ష్ హబ్'ని మైక్రోగ్రావిటీ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్వహణ, కక్ష్య రవాణా నిల్వ కోసం ఉపయోగించవచ్చు.తాము చేస్తున్న ప్రయత్నం మున్ముందు చంద్రుడిపైనా ఆవాస అన్వేషణకు తోడ్పడుతుందని కంపెనీ తమ వెబ్సైట్లో పేర్కొంది. నిర్మాణం అనుకున్న గమ్యాన్ని చేరుకున్న తర్వాత పూర్తిగా ఏర్పాటు చేయడానికి సుమారు ఏడు రోజులు పడుతుందని ఆకాశలబ్ధి సీఈవో సిద్దార్థ్ జెనా చెప్పారు. కాగా మిషన్ కోసం స్లాట్‌ను బుక్ చేయడానికి ఈ కంపెనీ ఇలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఆ గ్రహంపై కాలనీ ఏర్పాటు చేసేది ఎక్కడ?
ఎలన్ మస్క్ గుర్తున్నాడా? అదేనండి.. పేపాల్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల వ్యవస్థాపకుడు. ఇంకో వందేళ్లలో మనుషులకు అంగారకుడిపై కాలనీ కట్టేస్తానని ప్రకటించిన వ్యక్తి ఈయన. అణుయుద్ధాలు మొదలుకొని.. వాతావరణ మార్పుల వరకూ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భూమిపై మనిషి మనుగడ అసాధ్యమని.. ఈ శతాబ్దం అంతానికల్లా ఇంకో గ్రహాన్ని వెతుక్కోకపోతే కష్టమేనని మస్క్, ప్రఖాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌లు ఈ మధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్... తానిచ్చిన మాటకు తగ్గట్టుగానే ముందుకెళుతున్నాడు. మొత్తం పది లక్షల మందితో ఏర్పాటు చేయాలనుకుంటున్న మార్స్ కాలనీకి ఇంకో రెండేళ్లలో తన ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు. అరుణ గ్రహం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు డ్రాగన్ –2 అంతరిక్ష నౌక ద్వారా ముందుగా కొంత సామగ్రిని అక్కడికి పంపిస్తామని.. ఆ తరువాత దశలవారీగా తన ప్రణాళికను అమలు చేస్తానని అంటున్నాడు మస్క్. ఈ వివరాలతో ఆయన ఇటీవలే ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేశాడు. మార్స్ కాలనీలో నివాసానికి ఒక్కొక్కరికీ ఎంత ఖర్చవుతుంది? అక్కడికి చేరుకోవడం ఎలా? ఎదురయ్యే ఇంజినీరింగ్ సవాళ్లు ఎలాంటివి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వంటి అనేక అంశాలను ఇందులో చర్చించారు. రెండేళ్లలో సామగ్రితో తొలి అంతరిక్ష నౌకను ప్రయోగించిన తరువాత దాదాపు వందమంది ప్రయాణించగల అంతరిక్ష నౌకను అభివృద్ధి చేయాలన్నది మస్క్ ప్లాన్. దీంతోపాటు.. అంగారకుడికి వెళ్లే మార్గమధ్యంలోని కొన్ని ఉపగ్రహాలపై ఇంధనాలను నింపుకునే ఏర్పాట్లు చేస్తే ప్రయాణం సులువు అవుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను చేరేందుకు కూడా ఈ ఏర్పాటు పనికొస్తుందన్నది ఆయన అంచనా. అయితే ఆ గ్రహంపై కాలనీ ఏర్పాటు చేసేది ఎక్కడ? అన్నది మాత్రం ప్రస్తుతానికి అస్పష్టం. వంద మందితో ప్రారంభమై.. పదిలక్షల మందితో మార్స్ కాలనీ పూర్తయ్యేందుకు 40 నుంచి 100 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. భూమి మీద స్పేస్ లేదు. ఇక అంతరిక్షంలోకే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్