బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఆకాశలబ్ధి వినూత్న ప్రయత్నం చేస్తోంది. వ్యోమగాములు, పరిశోధకులు, అంతరిక్ష పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి అంతరిక్షంలో నివాసాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోంది.
ఆరు నుంచి 16 మందికి వసతి కల్పించేలా అంతరిక్ష నివాస పరిష్కారాన్ని రూపొందిస్తోంది ఆకాశలబ్ధి. దీనికి సంబంధించిన వివరాలను లింక్డ్‌ఇన్‌లో వెల్లడించింది. దీన్ని 'తారల మధ్య ఇల్లు'గా పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 'అంతరిక్ష్ హబ్' పేరుతో ఆవాస నమూనాను ఆకాశలబ్ధి సిద్ధం చేసింది.
'అంతరిక్ష్ హబ్' అనేది విస్తరించదగిన షెల్ వంటి నిర్మాణం. ఇది అసాధారణమైన అంతరిక్ష శిధిలాలు, రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతరిక్షంలో నివాసంతో పాటు బహుళ ప్రయోజనాల కోసం వినియోగించేలా దీని డిజైన్‌ను రూపొందిస్తున్నారు. 'అంతరిక్ష్ హబ్'ని మైక్రోగ్రావిటీ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్వహణ, కక్ష్య రవాణా నిల్వ కోసం ఉపయోగించవచ్చు.
తాము చేస్తున్న ప్రయత్నం మున్ముందు చంద్రుడిపైనా ఆవాస అన్వేషణకు తోడ్పడుతుందని కంపెనీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. నిర్మాణం అనుకున్న గమ్యాన్ని చేరుకున్న తర్వాత పూర్తిగా ఏర్పాటు చేయడానికి సుమారు ఏడు రోజులు పడుతుందని ఆకాశలబ్ధి సీఈవో సిద్దార్థ్ జెనా చెప్పారు. కాగా మిషన్ కోసం స్లాట్‌ను బుక్ చేయడానికి ఈ కంపెనీ ఇలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment