దొనకొండలో స్పెయిన్ ప్రతినిధుల పర్యటన
► ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటుకు స్థల పరిశీలన
దొనకొండ (దర్శి): దొనకొండ ప్రాంతంలో స్పెయిన్ దేశ ప్రతినిధుల బృందం గురువారం పర్యటించింది. ఏపీఐఐసీ దొనకొండను పారిశ్రామిక ప్రాంతంగా ప్రకటించడంతో ఇడియాడ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్పెయిన్ ప్రతినిధులు మన్దీప్ టాక్, లూయీస్ అయించిల్ బృందం, సచివాలయం ఓఎస్డీ సాగర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి స్థలాలను పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో భూములను సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు.
అనంతరం ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, పి.వెంకటాపురం, రుద్రసముద్రం, భూమనపల్లి, రాగమక్కపల్లి పొలాలను చూశారు. రుద్రసముద్రం, భూమనపల్లి, రాగమక్కపల్లి ప్రాంతంలోని 262,292–305 సర్వే నంబర్లలో 1105 ఎకరాలను, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి, పి.వెంకటాపురంలో 325–346లో 1400 ఎకరాలు పరిశీలించారు. వాహనాల విడి భాగాలు జతపరిచినప్పుడు వాటిని పరీక్షించడం, క్రాష్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, సేఫ్టీ టెస్ట్‌లు ఈ కంపెనిలో నిర్వహిస్తారన్నారు. దీనికి సంబంధించి సుమారు 2500 ఎకరాలు భూమి అవసరం ఉందన్నారు. ప్రపంచంలో స్పెయిన్, చైనాలో ఈ కంపెనీ కొనసాగుతుందన్నారు. ఆర్కిటెక్ట్ డిజైనర్లు నిఖిల్, వీరేంద్ర, ఆంటోనియో, ప్రాజెక్ట్ ఇంజినీర్ కుమార్, హబ్ లైజనింగ్ అధికారి సి.హెచ్.ఆశీర్వాదం, ఆర్ఐ రాజేష్, లైసెన్స్ సర్వేయర్ వెంకట్రావు పాల్గొన్నారు.