దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ
ఆదోని, న్యూస్‌లైన్ : బీజేపీతో టీడీపీ జట్టు కట్టడంతో తెలుగుతమ్ముళ్లపై ఆ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో ఆదివారం ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదోని డివిజన్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడం.. ఈ రెండు పార్టీల తీరుపై మైనార్టీ ఓటర్లు భగ్గుమంటుండటంతో టీడీపీ శ్రేణులు డీలాపడ్డాయి. ఇదే సమయంలో మున్సిపల్, తొలి విడత ప్రాదేశిక పోరు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుండటం టీడీపీ అభ్యర్థులను
కలవరపరుస్తోంది.
వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాయి. డివిజన్లో మొత్తం 17 మండలాలు ఉండగా.. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, గుమ్మనూరు జయరాం, వై.బాలనాగిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు.. అభివృద్ధితో పాటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. ఆదోనిలో వై.సాయిప్రసాద్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్‌లు సోమవారం ఉదయం కడితోట, జి.హొసళ్లి, ఇస్వి గ్రామాల్లో.. సాయంత్రం బసాపురంలో ప్రచారం చేపట్టగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాంలు ఎమ్మెల్యే నీరజారెడ్డి స్వగ్రామం తెర్నేకల్లులో ప్రచారం చేపట్టగా విశేష స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపును భుజానికెత్తుకున్న మంత్రాలయం నియోజకవర్గ సమన్వయకర్త సొంత మండలంలో విస్తృతంగా పర్యటించారు.
ఇదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీతో టీడీపీ దోస్తీ చేయడం.. ఆ రెండు పార్టీలు ఇప్పటికీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఈ పార్టీల నాయకులు ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోతున్నారు. నాయకుల మాటకు కట్టుబడి పోటీకి సిద్ధమైన అభ్యర్థులు ఇప్పుడు వారే ముఖం చాటేస్తుండటంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలాఉండగా రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ పోటీలో నామమాత్రమని ఇప్పటికే తేలిపోయింది. ఏదేమైనా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతోంది.