నో ఎంట్రీ
► అసెంబ్లీలోకి ఆ ముగ్గురు అనర్హులు
► బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్
► గవర్నర్ కిరణ్‌బేడీ ఆదేశాల నిరాకరణ
► పుదుచ్చేరిలో రాజకీయ హోరు
పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయపోరు రోజురోజుకూ రణరంగ హోరుగా మారిపోతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేస్తోందని సీఎం నారాయణ స్వామి ఆరోపణలకు ఊతమిచ్చేలా బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేల రంగప్రవేశం, సదరు ఎమ్మెల్యేలతో గవర్నర్ కిరణ్‌బేడీ చేయించిన పదవీ ప్రమాణ స్వీకారం చెల్లదని అసెంబ్లీ స్పీకర్ సోమవారం చేసిన
ప్రకటనతో పుదుచ్చేరి రాజకీయాలు రణరంగంగా మారిపోయాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలో పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రవేశం లభించలేదు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలకు అదనంగా మూడు నామినేటెడ్ స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన పూర్తి బలం లేని కాంగ్రెస్ తన 15 మంది ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు డీఎంకే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో అధికారంలోకి వచ్చింది.
గడిచిన ఎన్నికలవరకు అధికారంలో ఉండిన ఎన్ఆర్ కాంగ్రెస్ 8 మంది సభ్యులతో ప్రతిపక్ష స్థానంలో కూర్చునుంది. వీరికి తోడుగా అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ప్రతిపక్షానికి ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తోడు కావడంతో ప్రతిపక్షాల బలం 15కు చేరుకుంది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య ఎమ్మెల్యేల వ్యత్యాసం కేవలం మూడు మాత్రమే. గత నెల 26వ తేదీ బీజేపీ జాతీయ అ«ధ్యక్షులు అమిత్‌షా పుదుచ్చేరిలో రెండురోజులు పర్యటించి ఢిల్లీకి చేరుకున్న కొద్దిరోజుల్లోనే నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారం సాగింది.
అధికారపార్టీ అనుమతితో ఎమ్మెల్యేలను నామినేట్ చేయాలనే నిబంధనను బీజేపీ పాటించలేదని కాంగ్రెస్ కస్సుబుస్సులాడుతోంది. ముగ్గురిని ఎమ్మెల్యేలుగా నామినేట్ చేసినట్లు కేంద్ర హోంశాఖ నుంచి ఈనెల 3వ తేదీన పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తరం అందింది. స్పీకర్ వైద్యలింగాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి పదవీ ప్రమాణం చేయించాల్సిందిగా కోరారు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా కొన్ని ఉత్తర్వులు అందాల్సి ఉందని స్పీకర్ దాటవేయడంతో గవర్నర్ కిరణ్‌బేడీ అదే రోజు రాత్రికి రాత్రే వారిని తన చాంబర్‌కు పిలిపించుకుని పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి విన్సెంట్ రాయర్ను కలిసి తమను బీజేపీ ఎమ్మెల్యేలుగా పరిగణించేలా తగిన చర్యలు తీసుకోవాలని, గదులను కేటాయించాలని కోరారు.
ఉత్తరం వెనక్కు పంపిన స్పీకర్
ఇదిలా ఉండగా నామినేటెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి గవర్నర్ కార్యదర్శి నుంచి అసెంబ్లీ కార్యదర్శికి సైతం ఉత్తరం వచ్చింది. గవర్నర్ రాసిన ఉత్తరాన్ని అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్‌కు అందజేయగా తీసుకునేందుకు నిరాకరించి వెనక్కు పంపాల్సిందిగా ఆదేశించారు. ఎమ్మెల్యేల నియామక పత్రాల్లో పూర్తి వివరాలు లేవు, స్పీకర్ కార్యాలయం నుంచి వారి నియామకంపై ఉత్తర్వులు రానందునే పదవీ ప్రమాణస్వీకారానికి అంగీకరించలేదని స్పీకర్ అన్నారు. తాత్కాలిక స్పీకర్ ఉన్నపుడు మాత్రమే పదవీ ప్రమాణం చేయించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది కాబట్టిచ ప్రస్తుతం గవర్నర్ చేయించే పదవీ ప్రమాణం చెల్లదని అన్నారు. అంతేకాదు, అసెంబ్లీలోకి ఈ ముగ్గురిని అనుమతించబోమని, మీరిన పక్షంలో మార్షల్స్‌చేత గెంటించే అవకాశం ఉంటుందని స్పీకర్ పరోక్షంగా హెచ్చరించారు. తాజా పరిణామాలతో పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీల యుద్ధం రసకందాయంలో పడింది.