2న తాత్కాలిక అసెంబ్లీ భవనం ప్రారంభం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని మార్చి 2వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రారంభోత్సవం చేయించేందుకు చివరివరకూ ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. దీంతో తానే స్వయంగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే నెల 2న ఉదయం 11.25 గంటలకు మంచి ముహూర్తమని పండితులు తెలపడంతో దాన్ని ఖరారు చేశారు.
ప్రారంభానికి ముందే కార్యకలాపాలు
ప్రారంభానికి ముందే సోమవారం నుంచి అధికారికంగా అసెంబ్లీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి తాత్కాలిక అసెంబ్లీ భవనంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కార్యాలయం తెలిపింది. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం సోమవారం ఉదయం నుంచి తాత్కాలిక అసెంబ్లీ నుంచే విధులు నిర్వహించనున్నారు.