రెండు గదులు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: శాసససభ ఇన్నర్లాబీలో ఇప్పటికే కేటాయించిన కార్యాలయంతో పాటు, ఆవరణలోనే తమ కోసం విశాలంగా ఉండేలా రెండుగదుల కార్యాలయాన్ని ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీజేపీ శాసనసభాపక్షం (బీజేఎల్పి) విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ పక్షాన 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు ఎంపీలున్నందున సమావేశమయ్యేందుకు, సందర్శకులను కలుసుకునేందుకు వీలుగా రెండుగదులున్న కార్యాలయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు శుక్రవారం స్పీకర్‌కు బీజేఎల్పీ పక్షాన ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అందుబాటులో ఉన్న గదులు, వీలును బట్టి తప్పకుండా అసెంబ్లీ ఆవరణలోనే కార్యాలయం కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు.