డ్రాపవుట్స్పై సర్కారు దృష్టి!
* బడి మానేస్తున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ
* కేజీ టు పీజీ పథకంలో అధిక ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల(డ్రాపవుట్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. కేజీ నుంచి పీజీ పథకం అమలులో భాగంగా ఈ డ్రాపవుట్స్ తగ్గింపునకు ప్రాధాన్యమిచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలోనే డ్రాపవుట్ రేట్ ఎక్కువగా ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉంటోంది. అలాంటి వారిని స్కూళ్లకు రప్పించేందుకు కేజీ-పీజీ పథకంలో ప్రాధాన్యమిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఓ కార్యాచరణను రూపొందించనుంది. దీనిపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది.
ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేక, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కుదరక తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు దూరం చేస్తున్నారని సర్కారు భావిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం... ప్రాథమిక పాఠశాల(ఒకటో తరగతిలో చేరిన వారు ఐదో తరగతికి వచ్చే సరికి) స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బడి మానేస్తున్న వారు 22.32 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఇది 3.20 శాతం మాత్రమే ఉంది. ఇక ఒకటో తరగతిలో చేరిన వారు 8వ తరగతికి వచ్చే సరికి తెలంగాణలో 32.56 శాతం మంది విద్యార్థులు బడి మానేస్తుంటే.. ఏపీలో 19.16 శాతం మంది బడికి దూరమవుతున్నారు. ఇక ఒకటో తరగతిలో చేరిన వారు పదో తరగతికి వచ్చే సరికి తెలంగాణ జిల్లాల్లో డ్రాపవుట్ రేటు 38.21 శాతంగా ఉండగా, ఏపీలో మానేస్తున్న వారు 26.83 శాతమే.
మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 53.21 శాతం మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక తెలంగాణలోని ఎస్సీల్లో 40.32 శాతం, ఎస్టీల్లో 62.81 శాతం డ్రాపవుట్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎస్సీల్లో 34.99 శాతం, ఎస్టీల్లో 60.37 శాతం డ్రాపవుట్స్ రేటు నమోదైంది.