పంట బీమా పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం
దేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ (SBI General Insurance) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు పంట బీమా పాలసీలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతో కలిసి పాలసీలను రైతుల ముంగిటకు చేర్చే ‘మేరీ పాలసీ మేరే హాథ్’ అనే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటోంది.‘మేరీ పాలసీ మేరే హాథ్’ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుండి మార్చి 15 వరకు జరగనుంది. ఇందులో భాగంగా రైతులకు వారి ఇంటి వద్దనే భౌతికంగా పంట బీమా పాలసీ పత్రాలను అందజేస్తారు. రైతులలో పంట బీమా ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి, నిరాటంకమైన పంట బీమా అనుభవం అందించేందుకు ఈ కార్యక్రమం రూపొందించారు.‘మేరీ పాలసీ మేరే హాథ్’ కార్యక్రమం ముఖ్యంగా పంట బీమా ప్రక్రియలో పారదర్శకతను పెంచడంపై దృష్టి సారిస్తుంది. పంట నష్టాలు వాటిల్లిన పక్షంలో వెంటనే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, సెంట్రల్ టోల్ ఫ్రీ నంబర్ 14447 వంటి వాటి ద్వారా సమాచారం అందించేలా రైతులను చైతన్యపరుస్తుంది. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.“పీఎంఎఫ్బీవై కింద రైతులకు పంట బీమా ప్రయోజనాలను సులభంగా అందించేందుకు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కట్టుబడి ఉంది. ఆర్థిక భద్రత, నిశ్చింతను రైతులకు అందించడం, రిస్కులను అధిగమించడంలో వారికి సహాయం చేయడమే మా లక్ష్యం. ‘మేరీ పాలసీ మేరే హాథ్’ క్యాంపెయిన్ ద్వారా స్థానిక అడ్మినిస్ట్రేషన్లు, భాగస్వాములు, రైతులతో కలిసి సమర్ధవంతంగా, ప్రభావవంతంగా పాలసీల పంపిణీకి మా నిబద్ధతను తెలియజేస్తున్నాము” అని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా పేర్కొన్నారు.