ఎవరీ గోపీ?
ఢిల్లీ డ్రగ్ ముఠా విచారణలో వెలుగులోకి
హైదరాబాదీగా అక్కడి పోలీసుల అనుమానం
దర్యాప్తు చేస్తున్న స్పెషల్ సెల్ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సోమవారం గుట్టురట్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ కేసు దర్యాప్తులో దక్షిణాది కీలకంగా మారింది. ముఠాలో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న గోపి హైదరాబాదీగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద చర్యలకు అవసరమైన నిధుల సమీకరణకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ డ్రగ్స్ దందా ప్రారంభించింది. దుబాయ్‌లో ఉంటున్న అలీ దీన్ని నిర్వహిస్తున్నాడు.
అతను ఆర్డర్ చేసిన మేరకు పాక్‌లోని అబోటాబాద్‌లో ఉంటున్న హిజ్బుల్ కమాండర్ ఫయాజ్ అలియాస్ తన్వీర్ అలియాస్ షంషేర్ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్ మీదుగా డ్రగ్స్ పంపుతున్నాడు. సరిహద్దులు దాటించడంలో జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగంలోని కానిస్టేబుల్ ఖుర్షీద్ ఆలం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా భారత్‌లోకి చేరుకున్న డ్రగ్స్‌ను ఇదే ముఠాకు చెందిన బి.గణేష్, ఎం.సెంథిల్ (తమిళనాడు వాసులు) దక్షిణాదికి తెస్తున్నారు.
ఇక్కడ ఉండే గోపి ద్వారా విక్రయిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో వలసపన్నిన స్పెషల్ సెల్ పోలీసులు ఖుర్షీద్, గణేష్, సెంథిల్లను అరెస్టు చేసి రూ.35 కోట్ల విలువైన 10 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గోపి పేరు వెలుగులోకి వచ్చినా... అతను తరచు తమిళనాడుకు వచ్చి ‘మాల్’ తీసుకునే వాడని, వివరాలను గోప్యంగా ఉంచాడని వెల్లడైంది.
ప్రాథమిక ఆధారాలతో పాటు మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు.. గోపి హైదరాబాద్‌కు చెందిన వాడని అనుమానిస్తున్నారు. మరికొన్ని వివరాల సేకరణకు త్వరలోనే నగరానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. సిటీలో గడిచిన మూడేళ్లుగా పట్టుబడిన డ్రగ్ రాకెట్లు, ప్రమేయం ఉన్న వ్యక్తులు, పరారీలో ఉన్న వారి వివరాలను ఇక్కడి పోలీసుల నుంచి సేకరించాలని ఢిల్లీ స్పెషల్ సెల్ నిర్ణయించిందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు.