ఉత్సవ విగ్రహాలుగా ఎస్‌హెచ్‌వోలు
- విచారణకు ప్రత్యేక బృందాలు
- విధివిధానాలపై సీపీ వెంకటేశ్వరరావు కసరత్తు
- కమిషనరేట్‌లో సుదీర్ఘ చర్చ
- విచారణకు ప్రత్యేక టీములు
- విధివిధానాలపై సీపీ కసరత్తు
విజయవాడ సిటీ : పోలీసు స్టేషన్ స్థాయిలో ఇప్పటివరకు కింగ్‌మేకర్ పాత్ర పోషించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లు(ఇన్స్పెక్టర్లు) రానున్న రోజుల్లో డమ్మీలుగా మారనున్నారు. కేసుల విచారణ బాధ్యతలను ప్రత్యేక టీముల(ఇన్వెస్టిగేషన్ టీమ్స్)కు అప్పగించి ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) నమోదు, బందోబస్తు విధులకు ఎస్‌హెచ్‌వోలను పరిమితం చేయనున్నారు. ఈ విధానంపై విధివిధానాలు రూపొందించేందుకు సోమవారం కమిషనరేట్‌లో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలతో సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు సమావేశమై చర్చించారు.
జోనల్ స్థాయిలో ఐదేసి ప్రత్యేక విచారణ(ఇన్వెస్టిగేషన్) బృందాలు ఏర్పాటుకానున్నట్లు తెలిసింది. ఆయా టీములకు కేసుల వారిగానా? స్టేషన్ల వారీగా? బాధ్యతలు అప్పగిస్తారనేది ఇంకా స్పష్టతరాలేదు. మెజారిటీ అధికారులు ఎస్‌హెచ్‌వోల పాత్రను పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో జరిగిన శ్రీలక్ష్మి, ఆయేషామీరా హత్యకేసులు, పెదఅవుటుపల్లి ట్రిపుల్ మర్డర్ కేసుల్లో ఇలాంటి విచారణ బాగుంటుందే తప్ప ప్రతికేసును కూడా ప్రత్యేక విచారణ బృందానికి అప్పగించడాన్ని పలువురు వ్యతిరేకించినట్టు సమాచారం.
ఈ నిర్ణయంతో పోలీసు స్టేషన్లలో తమ పాత్ర ‘ఉత్సవ విగ్రహాల’ మాదిరి తయారవుతుందనే ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నూతన విధానం అమలుచేయాలని సీపీ యోచిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం పోలీసు స్టేషన్ల స్థాయిలో కేసుల నమోదు, దర్యాప్తు బాధ్యతలను ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా పోలీసు స్టేషన్లలో సిబ్బందిని సమన్వయం చేసుకొని కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టిసారించి నిందితుల అరెస్టు మొదలు న్యాయస్థానంలో చార్జిషీటు(నేరాభియోగపత్రం) దాఖలు వరకు ఇన్స్పెక్టర్లు బాధ్యత తీసుకుంటున్నారు. కీలక కేసుల్లో పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల పట్టివేత, అరెస్టు వంటి చర్యలు తీసుకుంటున్నారు. లోకల్ అధికారుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కేసుల విచారణ సమయంలో కీలక సమాచారం వస్తోంది. తద్వారా కేసుల దర్యాప్తును వేగం చేసేందుకు దోహదపడుతోంది.
రానున్న రోజుల్లో
సీపీ ఆలోచనలకు అనుగుణంగా కేసుల దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక బృందాలకు అప్పగిస్తే స్టేషన్ అధికారుల పాత్ర నామమాత్రం కానుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక బృందాలకు కేసును బదలాయించాల్సి ఉంటుంది. దర్యాప్తు, నిందితుల అరెస్టు వంటి అన్ని అంశాలను దర్యాప్తు బృందాలు పర్యవేక్షిస్తాయి. ముఖ్యులు వచ్చినప్పుడు బందోబస్తు విధులకు ఎస్‌హెచ్‌వోలు సహా దర్యాప్తు బృందంలో లేనివారిని వినియోగిస్తారు.
ఇలా ఉండొచ్చు
నూతన విధానంలో ప్రతి జోన్‌కు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఉండొచ్చని కమిషనరేట్ వర్గాల సమాచారం. సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఇద్దరు ఎఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, కొందరు హోంగార్డులు దర్యాప్తు బృందంలో ఉంటారు. ఐదు దర్యాప్తు బృందాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జోన్లలోని ఇద్దరు ఇన్స్పెక్టర్లకు అప్పగిస్తారు. వీరిని ఏసీపీలు పర్యవేక్షిస్తుంటారు. స్టేషన్లలో కేసులు నమోదైన వెంటనే వీరికి ఎఫ్ఐఆర్లు బదిలీ చేయాల్సి ఉంటుంది.
విధివిధానాలు రూపొందిస్తున్నాం
విచారణ బాధ్యతలను వేరు చేసే విషయంలో విధివిధానాలు రూపొందిస్తున్నట్లు సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు చెప్పారు. సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో నూతన విధానంపై చర్చిస్తున్నట్టు తెలిపారు.