special diet
-
స్పెషల్ డైట్.. అదే రైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ యమా యాక్టివ్‌గా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా అంతే యాక్టివ్‌గా స్పందిస్తోంది. స్పెషల్ డైట్ ఇచ్చి రోగుల శరీరం నుంచి కరోనాను సాగనంపాలని నిర్ణయించింది. కోవిడ్ బాధితుల రోగనిరోధకశక్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో పోషక విలువలున్న ప్రత్యేక భోజనం అందించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు కోవిడ్ బాధితుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 10 వేల యాక్టివ్ కేసులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగంమంది హోం క్వారంటైన్లో ఉండగా మిగతా వారు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌కు సరైన మందు లేకపోవడంతో రోగనిరోధకశక్తిని పెంచడమే వ్యాధిని జయించడానికి ఏకైక మార్గమని భావిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతోపాటు ఎన్ఐఎన్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) ఆధ్వర్యంలో ప్రత్యేక డైట్‌చార్ట్ రూపొందించింది. దీని ప్రకారం గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్న ఈ డైట్‌ను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వేగంగా కోలుకునేలా... కోవిడ్ పేషెంట్ వేగంగా కోలుకునేందుకు అదనపు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు అన్నివర్గాలు ప్రాధాన్యత ఇచ్చే ఆహార పదార్థాలనే డైట్‌చార్ట్‌లో పొందుపర్చారు. రోజూ తినే భోజనంతోపాటు కొన్ని అదనపు పోషకాల కింద ఉడికించిన కోడిగుడ్డు, పండ్లు, డ్రైఫ్రూట్స్ జోడించారు. కోవిడ్ రోగులకు ఆహారాన్ని తాజాగా, వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలని, అప్పుడే పోషకాలు పూర్తిస్థాయిలో శరీరంలోకి చేరతాయని, ఆ మేరకు వండిన వెంటనే ఆహారాన్ని ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పేషెంట్ డైట్‌చార్ట్ ఇలా.... ► ఉదయం 7.30 నుంచి 8.00 గంటల మధ్య అల్పాహారం కింద ఇడ్లీ, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పలలో ఏదో ఒకదాన్ని అందిస్తారు. దీనితోపాటు కాచిన పాలు ఇస్తారు. ► ఉదయం 10 గంటలకు బిస్కెట్లతోపాటు టీ లేదా కాఫీ ఇస్తారు. ► మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య వరి అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, వెజ్‌కర్రీ, మినరల్ వాటర్ బాటిల్‌తోపాటు ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు అందిస్తారు. ► సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల్లోపు ప్రత్యేక పోషకాహారంగా కాఫీ లేదా టీతోపాటు ఖర్జూరం, బాదంపప్పు ఇస్తారు. æ రాత్రి డిన్నర్లో అన్నంతోపాటు వెజిటబుల్ కర్రీ, సాంబార్, పెరుగు, పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు, మినరల్ వాటర్ అందజేస్తారు. -
ట్రైనీ పోలీసులకు ప్రత్యేక డైట్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కోరలు చాపుతున్న వేళ పోలీసు శిక్షణ కేంద్రాలు అప్రమత్తమయ్యాయి. శిక్షణలో ఉన్న పోలీసులకు అధికారులు ప్రత్యేకమైన డైట్ ఇస్తున్నారు. లీవులన్నీ రద్దు చేశారు. అకాడమీల్లో ఔటింగ్‌లను పూర్తిగా రద్దు చేశారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే.. అది కూడా ప్రాణాపాయం, మరణాలు వంటి అత్యవసర పరిస్థితుల్లోనే అనుమతిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం, దేశమంతా లాక్డౌన్ విధించడంతో జిల్లాల్లో శిక్షణ పొందుతున్న అన్ని పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లోనూ ట్రైనీల ఆరోగ్యరీత్యా పలు చర్యలు చేపట్టారు. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా మాస్కులు, శానిటైజర్లు ఇస్తున్నారు. శిక్షణ సమయంలో కూడా భౌతిక దూరం తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ట్రైనీ పోలీసులకు రోగనిరోధకశక్తి పెంపొందించేందుకు స్పెషల్ డైట్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా సి–విటమిన్ మాత్రలతోపాటు నారింజ, బత్తాయి, పైనాపిల్ పండ్లను కూడా ఇస్తున్నారు. సెలవు తీసుకుంటే క్వారంటైన్ తప్పనిసరి.. లాక్డౌన్ నేపథ్యంలో పీటీసీల్లో సెలవులు ఎప్పుడో రద్దు చేశారు. మరీ అత్యవసరమైన వారికి మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ అలా వెళ్లొచ్చిన నేపథ్యంలో వారు 14 రోజులు తప్పకుండా క్వారంటైన్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సిందే. కొత్త వ్యక్తులను లోపలికి రానీయడంలేదు. పోలీసు శిక్షణ పొందుతున్న ప్రతీ ట్రైనీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు 24 గంటలు వైద్య సి బ్బం దిని అందుబాటులో ఉంచారు. ట్రైనీ క్యేడెట్ల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధతో పకడ్బ ందీగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. డీజీపీ ఆదేశిస్తే కరోనా విధుల్లోకి.. 2018లో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) 18 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 12 మంది ఎస్సైలు, 17 వేల మంది కానిస్టేబుల్ పోస్టులున్నాయి. ఎస్సైలకు ఇప్పటికే సగం శిక్షణ పూర్తయింది. ఈ జనవరిలో దాదాపు 12 వేలమందికిపైగా కానిస్టేబుళ్లకు కూడా తరగతులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 13 వేలమందికిపైగా శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతర విధులకు ట్రైనీ ఎస్సైలు హాజరయ్యారు. నాలుగైదు రోజులపాటు వీరంతా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరమైతే.. అందులోనూ డీజీపీ నుంచి ఆదేశాలు వస్తేనే.. శిక్షణ సిబ్బందిని వినియోగించే అవసరాన్ని పరిశీలిస్తామని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
కత్రినా డ్యాన్స్ సీక్రెట్ ఏంటంటే..
'బార్ బార్ దేఖో' సినిమాలో కాలా చష్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసి కత్రినా కైఫ్ మరోసారి బాలీవుడ్‌ను తనవైపు తిప్పుకొంది. యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో కలసి పోటాపోటీగా చిందేసిన కత్రినా.. డ్యాన్స్ విషయంలో ఎవరైనా తన తర్వాతే అని నిరూపించింది. ఇప్పటికే ప్రత్యేక గీతాల్లో తనదైన ముద్ర వేసిన క్యాట్.. మరోసారి కాలా చష్మాతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. అయితే ఆమె డ్యాన్స్ చేసే ముందు ప్రత్యేక డైట్ ఫాలో అవుతుందట. షూటింగ్‌కు మూడువారాల ముందు నుంచే ఆమె కార్బొహైడ్రేట్స్ ఉండే డైట్‌ను తీసుకోవడం మానేస్తుంది. కేవలం ద్రవరూపంలో ఉండేవాటినే తీస్కుంటూ ఉంటుందట. పళ్ల రసాలు, సూప్స్, బ్రకోలి వంటి వాటిని అల్పాహారంలోను, మధ్యాహ్న భోజనంలోను తీసుకుంటుంది. ఇక షూటింగ్‌కు ముందైతే మజ్జిగ మాత్రమే తాగుతుంది. ఆ మజ్జిగ ఆమెకు చాలా ఎనర్జీని ఇస్తుందట. మొత్తంగా ఏ మాస్ పాటకు డ్యాన్స్ చేయడానికైనా కత్రినా ఇదే డైట్ ఫాలో అవుతుందట. మెరుపుతీగలా కదులుతూ కుర్రకారును ఉర్రూతలూగించే కత్రినా డ్యాన్స్ వెనుక ఉన్న డైట్ సీక్రెట్ ఇదన్నమాట. 'బార్ బార్ దేఖో' సినిమా సెప్టెంబరు నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. -
వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్లల్లో ఉన్న వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా ఇచ్చే ఆహార పదార్థాలకు అదనంగా అరటి పండు, పాలు, బిస్కెట్లు ఇచ్చేలా జైళ్ల శాఖ డీజీ టి.కృష్ణరాజు పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర జైళ్లల్లో ఉన్న మహిళా ఖైదీల్లో అత్యధికులు నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే. చిన్ననాటి నుంచీ వీరికి పౌష్టికాహార లోపం ఉండటంతో నిత్యం రుగ్మతల బారినపడుతున్నారు. ప్రధానంగా మధుమేహం, హృద్రోగంతో పాటు హైపర్ టెన్షన్ వంటి అనారోగ్యాలకు లోనవుతున్నారు. సాధారణంగా 65 ఏళ్ళు వచ్చిన, పైబడిన మహిళల్లోనే ఈ రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు జైళ్ల శాఖ నిర్థారించింది. పురుషులతో పోలిస్తే మహిళలకే వీటి బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటోందని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గత నెల విశాఖపట్నంలో జరిగిన రిట్రీట్-2014 కార్యక్రమంలో ప్రధానంగా ఈ సమస్య పైనే జైళ్ల శాఖ అధికారులు చర్చించారు. మహిళా వృద్ధ ఖైదీలకు, రుగ్మతల బారినపడిన వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నప్పటికీ పౌష్టికాహారం ఇవ్వనిదే ఫలితాలు ఉండవని తీర్మానించారు. దీంతో 65 ఏళ్ళు వచ్చిన, పైబడిన మహిళా ఖైదీలకు నిత్యం ఇచ్చే ఆహారానికి అదనంగా ప్రతి రోజూ సాయంత్రం ఒక్కొక్కరికీ 100 మిల్లీ లీటర్ల పాలు, ఒక అరటి పండు, మూడు సాల్ట్ బిస్కెట్లు ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి జైళ్ల శాఖ డీజీ ప్రతిపాదనలు పంపారు. ఈ డైట్ కారణంగా ఒక్కో ఖైదీకి రూ.9.10 పైసలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని లెక్కకట్టారు. వీటికి ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం అన్ని జైళ్లలోనూ అమలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తక్షణం అమలు చేయడానికి జైళ్ల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.