వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారం | special diet for old female prisoners | Sakshi
Sakshi News home page

వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారం

Published Mon, Mar 30 2015 7:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

special diet for old female prisoners

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్లల్లో ఉన్న వృద్ధ మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆహారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా ఇచ్చే ఆహార పదార్థాలకు అదనంగా అరటి పండు, పాలు, బిస్కెట్లు ఇచ్చేలా జైళ్ల శాఖ డీజీ టి.కృష్ణరాజు పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర జైళ్లల్లో ఉన్న మహిళా ఖైదీల్లో అత్యధికులు నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే. చిన్ననాటి నుంచీ వీరికి పౌష్టికాహార లోపం ఉండటంతో నిత్యం రుగ్మతల బారినపడుతున్నారు. ప్రధానంగా మధుమేహం, హృద్రోగంతో పాటు హైపర్ టెన్షన్ వంటి అనారోగ్యాలకు లోనవుతున్నారు. సాధారణంగా 65 ఏళ్ళు వచ్చిన, పైబడిన మహిళల్లోనే ఈ రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు జైళ్ల శాఖ నిర్థారించింది. పురుషులతో పోలిస్తే మహిళలకే వీటి బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటోందని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గత నెల విశాఖపట్నంలో జరిగిన రిట్రీట్-2014 కార్యక్రమంలో ప్రధానంగా ఈ సమస్య పైనే జైళ్ల శాఖ అధికారులు చర్చించారు.

మహిళా వృద్ధ ఖైదీలకు, రుగ్మతల బారినపడిన వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నప్పటికీ పౌష్టికాహారం ఇవ్వనిదే ఫలితాలు ఉండవని తీర్మానించారు. దీంతో 65 ఏళ్ళు వచ్చిన, పైబడిన మహిళా ఖైదీలకు నిత్యం ఇచ్చే ఆహారానికి అదనంగా ప్రతి రోజూ సాయంత్రం ఒక్కొక్కరికీ 100 మిల్లీ లీటర్ల పాలు, ఒక అరటి పండు, మూడు సాల్ట్ బిస్కెట్లు ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి జైళ్ల శాఖ డీజీ ప్రతిపాదనలు పంపారు. ఈ డైట్ కారణంగా ఒక్కో ఖైదీకి రూ.9.10 పైసలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని లెక్కకట్టారు. వీటికి ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం అన్ని జైళ్లలోనూ అమలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని తక్షణం అమలు చేయడానికి జైళ్ల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement