మళ్లీ తెరపైకి ‘కోనసీమ జిల్లా’
అమలాపురం, న్యూస్‌లైన్ :మూడువైపులా నదీపాయలు.. మరోవైపు బంగాళాఖాతం.. వీటి మధ్యన కొలువుదీరిన దీవి కోనసీమ. వరి, కొబ్బరి, ఆక్వా సాగులో జిల్లాలో తనకంటూ గుర్తింపు పొందింది. చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. జిల్లాను రాజకీయంగా, ఆర్థికంగా శాసించే స్థాయిలో ఉన్న కోనసీమను ప్రత్యేక జిల్లాగా చేయాలని దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు డిమాండ్ చర్చనీయాంశమైంది. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో కోనసీమను జిల్లా చేయాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు, ఇసుక రీచ్‌లు ఇలా జిల్లాలో వస్తున్న ఆదాయంలో కోనసీమది 40 శాతం వరకు ఉంటుందని అంచనా. జిల్లాలో సుమారు 51 లక్షల జనాభా ఉండగా, కోనసీమ జనాభా సుమారు 17 లక్షలు. గతంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, నియోజకవర్గ పునర్విభజనలో ఇవి ఐదుకు పరిమితయ్యాయి. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో మండలమైన తాళ్లరేవు, కొత్తపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆలమూరు కోనసీమ ఆవలివైపున్నాయి.
ప్రత్యేక దీవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే పూర్తిగా ఒక లోక్‌సభ నియోజకవర్గం కూడా కాని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయలేమని జిల్లాకు చెందిన ఇతర ప్రాంత నేతలు ఈ డిమాండ్‌ను కొట్టిపారేస్తున్నారు. అయితే కోనసీమ నుంచి ఏడాదికి రూ.1200 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. 12 ఇసుక రీచ్‌ల ద్వారా ఏటా రూ. ఏడెనిమిది కోట్ల ఆదాయం వస్తోంది. ఇక తాటిపాక జీసీఎస్, ఉప్పలగుప్తం రవ్వ, ఓడలరేవు ఓఎన్జీసీ చమురు క్షేత్రాలున్నాయి. ఒకప్పుడు కోనసీమ మారుమూల ప్రాంతమైనా జాతీయ రహదారులు 16, 216లు కోనసీమ మీదుగా వెళుతున్న నాటి నుంచి ప్రజారవాణా సంబంధాలు విస్తృతంగా పెరిగి జాతీయ జీవన స్రవంతిలో అనుసంధానం కావడంతో బాగా అభివృద్ధి చెందింది. విద్యారంగ పరంగా కూడా ఒక వైద్యకళాశాల, ఐదు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కొత్తపేట వద్ద గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంట్ ఉంది. ప్రత్యేక జిల్లా అనివార్యమైతే పారిశ్రామిక ప్రగతి శరవేగంగా జరిగే అవకాశం ఉంది.
డిమాండ్ ఏనాటిదో..
గతంలో ఇదే డిమాండ్‌పై మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘ఆవు పొదుగు మీకు.. తల మాకా’ అంటూ జిల్లా ఏర్పాటుకు సహకరించలేమని తేల్చి చెప్పి ఎద్దేవా చేశారు. అనంతరం మెట్ల ఆందోళనకు సిద్ధమైనా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి విరమించారు. నాయకులు వదిలేసినా కోనసీమను జిల్లాగా ఏర్పాటు చేయాలని అప్పుడప్పుడూ కొన్ని స్థానిక ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి.
విభజనతో ఊపు
రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలను పెంచే అవకాశముందనే ప్రచారం జరుగుతున్నందున కోనసీమను జిల్లా చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఊపందుకుంటోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో నర్సారావుపేట రెవెన్యూ డివిజన్‌తోపాటు మరో రెండు డివిజన్లను కలిపి పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎక్కువైంది. ఇదే విషయాన్ని రాష్ట్ర సహకార మంత్రి కాసు కృష్ణారెడ్డి బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ కోనసీమకు కూడా వర్తిస్తుంది. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయని, జిల్లాకు 25 వరకు స్థానాలు పెరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అంటే జిల్లాలో ఇప్పుడున్నదానికన్నా అదనంగా ఆరు పెరుగుతాయని, ఈ విధంగా చూస్తే కోనసీమలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు అదనంగా రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా ప్రతిపాదనకు ఇదొక కారణమవుతుందంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ప్రతిపాదన చేసింది. ఈ విధంగా చూస్తే కోనసీమలో ఉన్న నియోజకవర్గాలకు అదనంగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి జిల్లా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఉంది.