ఓటరు నోమోదు
=మొక్కుబడిగా ఓటరు నమోదు
=తెరుచుకోని పోలింగ్ కేంద్రాలు
=అందుబాటులో లేని ఫారాలు
=అధికారులు, రాజకీయ పార్టీల నిర్లక్ష్యం
=ప్రజలకు శాపం
‘ఓటరు నమోదు తప్పనిసరి. ఇందుకు అందరూ ముందుకు రావాలి. అధికారులు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలి. శత శాతం నమోదుకు కృషి చేయాలి’..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశాలివి. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ నామమాత్రంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఓటరు నమోదు కేంద్రాలు తెరుచుకోవడం లేదు. ఉన్న కేంద్రాల్లో ఫారాలు అందుబాటులో ఉండడం లేదు. అధికారుల నుంచి రాజకీయ పార్టీల వరకూ అంతా పట్టనట్టే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. గత నెల 24వ తేదీ నుంచి మూడు ఆదివారాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ బిఎల్వోలు నిర్దేశించిన కేంద్రాలవద్ద అందుబాటులో ఉండటంలేదు. వెరశి ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కావడం లేదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు పట్టనట్టు ఉంటున్నాయి. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు శాతం ఇంకు తార్కాణం.
గత నెల 18వ తేదీ వరకు జిల్లాలో 30,76,374 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 15,33,783 మంది పురుషులు, 15,42,591 మహిళా ఓటర్లు. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గత నెల 18వ తేదీ నుంచి మరోసారి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 10వ తేదీ వరకు చేర్పులు, సవరణలకు అవకాశముంది. ఈసారి యువ ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదే శించింది. దాని ప్రకారం కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు సమీక్షలు నిర్వహించి ఎన్నికల సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించి ఓటరు నమోదుపై విద్యార్థుల్లో అవగాహన కలిగించాలని సూచించారు.
నమోదు ఫారాలెక్కడ?
నవంబర్ 18వ తేదీ నుంచి ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించినా నవంబర్ 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో ఓటరు నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా తేదీల్లో జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు పత్రాలను స్వీకరిస్తారని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. కానీ ఆయా తేదీల్లో చాలా పోలింగ్ కేంద్రాలు అసలు తెరుచుకోలేదు.
ప్రజలు కేంద్రాలకు వెళ్లి తాళాలు వేసి ఉండడాన్ని చూపి వెనుదిరిగారు. నగరంలో కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ఉన్నా ఓటరు నమోదు ఫారాలు లేవు. సోమవారం నిర్వహించిన రెండో దఫా ప్రత్యేక కార్యక్రమంలో కూడా ఇదే తంతు కనిపించింది. కొన్ని చోట్ల నమోదు ఫారాలు ఉన్నా వాటిని సమర్పించిన తర్వాత ఎకనాలెడ్జ్మెంట్ ఇవ్వడం లేదు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించకపోవడం వల్లే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యువ ఓటర్లు ఎక్కడ?
ఈ దఫా యువ ఓటర్లపై దృష్టి సారించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. జిల్లాలో 2011 గణాంకాల ప్రకారం 44,44,536 మంది జనాభా ఉన్నారు. వీరిలో 18, 19 ఏళ్లవారు సుమారుగా 1.89 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 3.9 శాతం యువత మాత్రమే ఓటరుగా నమోదయ్యారు. కళాశాలలకు ఓటరు నమోదు ఫారాలు పంపించడం, అవగాహన కలిగించడం ద్వారా యువ ఓటర్ల శాతం పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 3 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.