Special Effect
-
బాంబుల ఏకనాథ్ ఇకలేరు
సినీ స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడు జి. ఏకనాథ్ (69) ఇక లేరు. ఐదు నెలలుగా కేన్సర్ వ్యాధితో పోరాడిన ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని వలసరవాక్కం లక్ష్మీనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్టణానికి చెందిన ఏకనాథ్ 55 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి సినీరంగంలో స్పెషల్ ఎఫెక్ట్స్ శాఖలో చేరారు. బాంబుల ఏకనాథ్‌గా పేరు పొందిన ఆయన 45 ఏళ్ల పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఏడువందలకు పైగా చిత్రాలకు పని చేశారు. ‘అల్లూరి సీతారామ రాజు, అగ్నిపర్వతం, జగన్మోహిని, తాండ్ర పాపారాయుడు, నాయకుడు’ వంటి ఎన్నో సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ చేశారు. సీనియర్ కెమెరామేన్ మోహనకృష్ణకు ఏకనాథ్ తమ్ముడు. దాసరి, కె.రాఘవేంద్రరావు, బాపయ్య, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, తమిళంలో కె.బాలచందర్ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఏకనాథ్ పనిచేశారు. కృష్ట, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాలకు పనిచేశారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరిరాస్తా’కి ఏకనాథ్ పని చేశారు. ఈయనకు భార్య అన్నపూర్ణ, కొడుకు అనంత్‌నాగ్, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. గురువారం పోరూర్‌లోని శ్మశాన వాటికలో ఏకనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ కన్నుమూత
స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ ఏక్నాథ్(70) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. కంప్యూటర్స్ లేని కాలంలోనే కెమెరా టెక్నిక్ ద్వారా ఎన్నో వింతలను వెండితెర మీద పరిచయం చేసి ఏక్నాథ్ విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక, జానపద చిత్రాలకు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించటంలో ఆయన స్పెషలిస్ట్. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించిన ఏక్నాథ్ 55 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి సినీరంగంలో స్థిరపడ్డారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఎన్టీఆర్, కమల్ హాసన్ లాంటి ఎందరో అగ్రహీరోల చిత్రాలకు ఆయన విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ముఖ్యంగా విఠలాచార్య సినిమాల్లో ఆయన వాడిన టెక్నిక్స్ మంచి పేరు తీసుకువచ్చాయి. కంప్యూటర్ యుగం మొదలైన తరువాత కూడా పలు త్రీడీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా పనిచేశారు. -
స్పెషల్ ఎఫెక్ట్.. అదుర్స్
నుదిటిన బుల్లెట్ గాయం.. ధారాళంగా కారుతున్న రక్తం.. మంటల్లో కాలిన ముఖం.. అక్కడక్కడా కత్తిగాట్లు.. గాయాలు.. ఇదేంటి ఎక్కడైనా రోడ్డు ప్రమాదం గానీ, అగ్నిప్రమాదం గానీ సంభవించిందా అనుకుంటున్నారా? కంగారు పడకండి. అలాంటిదేమీ లేదు. ఎప్పుడూ మనం సినిమాల్లో చూసే ఇలాంటి ఉత్తుత్తి గాయాలను ప్రత్యక్షంగా స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ వేసి చూపించారు సినీ పరిశ్రమకు చెందిన ఈశ్వర్, రాజు. నాటి స్టార్ వార్స్, జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి నేటి బాహుబలి, ఐ వంటి చిత్రాల్లో కీలకంగా మారిన ఈ స్పెషల్ ఎఫెక్ట్ మేకప్‌ను కళ్లకు కట్టినట్టు చూపించారు. నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు శనివారం వర్క్‌షాపు నిర్వహించారు. కత్తిగాటు నుంచి గ్రహాంతర వాసి వరకూ ఈ మేకప్‌తో సంచలనం సృష్టించవచ్చంటూనే వాటిని ఎలా వేయాలో చూపించారు. బాహుబలి లోని కాలకేయ పాత్ర మేకప్ గురించి విద్యార్థులు అడగ్గా, వెంటనే దానిని సృష్టించి ఆకట్టుకున్నారు. భార త సినీ పరిశ్రమలో వీఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్ మేకప్‌తో అద్భుతాలను సృష్టిస్తున్నట్లు ఈశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు తాను 150కు పైగా చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్‌ను అందించినట్లు తెలిపారు. - విజయవాడ (లబ్బీపేట)