సిటీ.. బ్యూటీ
ప్యాషన్ ఉండాలే గానీ ఎందులోనైనా రాణించవచ్చని నిరూపించింది మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ 2014 శ్వేతాతివారి. పెళ్లి చేసుకున్నా... తనలోని మోడల్‌ను కంటిన్యూ చేసిన శ్వేత... గత ఏడాది మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ పోటీల్లో విన్నర్‌గా నిలిచింది. రాజ్‌భవన్ రోడ్ ట్రావెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ‘స్పెషల్ హాలీడే ప్యాకేజెస్’ను శనివారం లాంచ్ చేసిన
సందర్భంగా శ్వేతతో ‘సిటీ ప్లస్’ చిట్‌చాట్...
ఛత్తీస్‌గఢ్ రాయపురాలో ఆచారవ్యవమారాలు తు.చ. తప్పకుండా పాటించే ఫ్యామిలీ మాది. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్యాషన్ షోలు, అందాల పోటీల గురించి వింటుంటే ఎంతో అబ్బురంగా ఉండేది. ఇంటర్లోకి వచ్చేసరికి మోడలింగ్ చేయాలనే కోరిక బలపడిపోయింది. విషయం ఇంట్లో చెబితే ఏమవుతుందోనన్న భయం! ధైర్యం చేశా... అందరికీ చెప్పా. అంతటి సంప్రదాయ కుటుంబమైనా... ‘నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి’ అంటూ ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది.
హైదరాబాద్ వచ్చి విల్లామేరీ కాలేజీలో బీకాంలో జాయిన్ అయ్యా. అప్పుడే మిస్ ఏపీ టైటిల్ గెలుచుకున్నా. కింగ్‌ఫిషర్ మోడల్ హంట్‌లో గెలిచా. 2012లో వ్యాపారవేత్త భాస్కర్ తివారీతో పెళ్లయింది. రెండేళ్లు మోడలింగ్ మానేశా. అయితే అత్తింటి వారిని ఒప్పించి మళ్లీ మోడలింగ్ ఆరంభించాను. ఫ్యామిలీ మద్దతు ఉంటే దేన్నయినా జయించవచ్చన్న ఆత్మవిశ్వాసం కలిగింది నాలో. కౌలంలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించి అందాల కిరీటం దక్కించుకున్నా. ఇది నా కెరీర్లోనే స్వీట్ మెమరీ. పెళ్లయితే అమ్మాయిలకు గ్లామర్ ఫీల్డ్‌లో కెరీర్‌కు ఫుల్స్టాప్ పడుతుందంటే నేను ఒప్పుకోను. మోడల్ కావాలనుకొనే అమ్మాయిలకు ప్రాంతీయ స్థాయిలో జరిగే అందాల పోటీలు కీలకమైనవి. నాకు ఫ్యాషన్ ప్రాణం. షాపింగ్ పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా వచ్చే మోడ్రన్ డ్రెస్‌లు కొనేస్తుంటా.
నగరంతో ఎంతో అనుబంధం
నేను బేసిగ్గా శాఖాహారిని. మా కుటుంబ నేపథ్యం, పెరిగిన తీరు వల్ల ఎన్ని నగరాలు తిరిగినా ఆహారపు అలవాట్లు మార్చుకోలేదు. బాలీవుడ్లో ఓ థ్రిల్లర్ సినిమాలో చేయమని అడిగారు. ఇంకా ఓకే చేయలేదు.
తెలుగులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఇక్కడి కల్చర్‌తో నాకు అటువంటి అనుబంధం ఉంది. గోల్కొండ, చార్మినార్లు అద్భుతం. ఇక సామాజిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటా. నేత్ర దానం చేశా. మీరూ నేత్ర దానం చేయండి. మనం ఈ భూమి మీద లేకపోయినా... మరొకరికి జీవితం ఇచ్చినవారమవుతాము. డయాబెటిక్ రోగిగా మా నాన్న పడే బాధ తెలుసు. అందుకే దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాను.
- వీఎస్