అప్రమత్తం
దసరా నేపథ్యంలో ఎబోలాపై ముందస్తు చర్యలు
మైసూరు ఉత్సవాలపై ప్రత్యేక నిఘా
ఆకతాయిలపై క్రిమినల్ కేసులు : మంత్రి
సాక్షి, బెంగళూరు : ‘ఎబోలా’ పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి ఈ వ్యాధి ప్రవేశించకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు వీలుగా బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో 15 పడకల ప్రత్యేక వార్డును కూడా సిద్ధం చేసింది.
ఎబోలా ప్రభావిత ఆఫ్రికా దేశాల్లో చాలా మంది కర్ణాటక వాసులు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉంటున్నారు. వీరంతా దసరాకు 20 రోజుల ముందే సొంత ప్రాంతాలకు వస్తుంటారు. వీరి ద్వారా ఎబోలా ఇక్కడా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మైసూరు ఉత్సవాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరంతా మైసూరుతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో మైసూరు, ఆ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక స్థలాల్లోనూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విశేష చర్యలు చేపట్టింది. అత్యవసర చికిత్స కోసం వచ్చే విదేశీయుల వివరాలను ఎప్పటికప్పుడు వైద్య శాఖకు తెలియజేయాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మైసూరు, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లలతో ప్రత్యేక పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎబోలా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత రోగికి చికిత్సలు అందించేందుకు వీలుగా మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఆఫ్రికా విద్యార్థులపై ఆంక్షలు
మైసూరు, బెంగళూరులో విద్యాభ్యాసం చేస్తున్న లియోనా, లైబీరియా, కిన్యా, నైజీరియా, సూడాన్ దేశాలకు చెందిన విద్యార్థులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వ్యాధి తీవ్రత పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ వీరిని ఆయా దేశాలకు వెళ్లకుండా ఆపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులు సొంత ప్రాంతాలకు వెళ్లడం, ఇప్పటికే సెలవుపై అక్కడకు వెళ్లిన వారు తిరిగి వచ్చే విషయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ఎబోలా ఉందని ఎస్ఎంఎస్, ఫేస్‌బుక్‌ల ద్వారా రూమర్లు ృష్టిస్తున్న ఆకతాయిలపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ హెచ్చరించారు.
వ్యాధి లక్షణాలు
వాంతులు, విరేచనాలు, జ్వరం, కీళ్లనొప్పులు, రక్తస్రావం కావడం ఎబోలా వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధిగ్రస్త వ్యక్తి స్రావాలు (లాలాజలం, వీర్యం, రక్తం తదితరాలు) నేరుగా ఆరోగ్యవంతుని శరీరంలోకి వెళ్లినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిపై మరిన్ని వివరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 080-22873151, 080-26631923లో సంప్రదించవచ్చు.