special officers Governance
-
స్థానిక సంస్థల పాలనపై కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ గురువారం నొటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో ఈ నొటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలకశాఖ ఉత్వర్వుల్లో పేర్కొంది. నిజానికి ఈ ఏడాది మార్చి 10న కార్పొరేషన్లో, జూన్ 30న మున్సిపాలిటీలలో, జూలై 2తో నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. (ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రభుత్వం.. శ్రీకాకుళంలోని కార్పొరేషన్లో అక్టోబర్ 10 వరకు మాత్రమే ప్రత్యేకాధికారుల పాలన పొడిగించగా మిగతా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లలో డిసెంబర్ 31 వరకు పొడిగించింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్లు నొటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. (పారదర్శకంగా ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకే సంస్కరణలు) -
‘ప్రత్యేక’కు ఇక బై
అమలాపురంటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు చివరిక్షణాలు సమీపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో కొత్త కౌన్సిళ్లు కొలువుదీరనున్నాయి. మూడున్నరేళ్లుగా సాగిన ప్రత్యేకాధికారుల పాలన పట్టణవాసుల్లో తీవ్రఅసంతృప్తిని కలిగించింది. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లాలో ఏర్పడ్డ మున్సిపల్ పాలకవర్గాల కాలపరిమితి 2010 సెప్టెంబర్ 30తో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రత్యేకాధికారుల పాలనను ఆరునెలలకోసారి పొడిగిస్తూ వచ్చింది. ఇలా మూడున్నరేళ్లలో ఏడు సార్లు పొడిగించింది. చివరకు కోర్టు జోక్యం చేసుకోవడంతో తప్పనిసరై ఎన్నికలను నిర్వహించింది. అందుబాటులో లేక... మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదటి ఆరునెలలు సంతృప్తికరంగానే సాగింది. ఆ తర్వాత ప్రత్యేకాధికారులు పాలనపై శ్రద్ధ చూపలేకపోయారు. తమ సొంత శాఖ విధులతోనే తలమునకలయ్యే ఆ అధికారులు ప్రత్యేక పాలన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయారు. వారు కేవలం ఫైళ్లపై సంతకాలకే పరిమితమయ్యారు. పట్టణాల్లో పేరుకుపోతున్న క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించలేకపోయారు. మూడో ఏడాది వచ్చేసరికి ఫైళ్లపై సంతకాలకోసం ప్రత్యేకాధికారులు ఉన్న జిల్లా కేంద్రానికో... డివిజన్ కేంద్రానికో మున్సిపల్ సిబ్బంది తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్ సిబ్బందికి ప్రజల సమస్యలపై జవాబుదారీతనం కరవైంది. అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం తదితర మున్సిపాలిటీల్లో వీధిలైట్లు, తాగునీరు, పారిశుధ్య సమస్యలు ఎక్కువయ్యాయి. గట్టెక్కనున్న సమస్యలు మరో పది రోజుల్లో మున్సిపల్ కొత్త కౌన్సిళ్లు జిల్లాలో కొలువుదీరనున్నాయి. ప్రజలు తమ సమస్యలను స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరింపజేసుకోవచ్చు. కౌన్సిలర్లు కూడా తమ తమ వార్డుల్లో రోజూ పర్యటిస్తూ సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లో లేదా కౌన్సిల్లో చర్చించో వాటి పరిష్కారానికి చొరవ చూపుతారు. మున్సిపల్ సిబ్బంది కూడా కౌన్సిలర్లకు భయపడి అప్రమత్తంగా విధులను నిర్వహిస్తారు. ఉదాహరణకు జిల్లాలో ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో పింఛన్లు నెలలో సగం రోజులు గడిచినా కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఉంది. ఇకపై సక్రమంగా పింఛన్లు అందే అవకాశం ఉంది.