ఎర్రచందనం దుంగల స్వాధీనం
సోమశిల: సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతంలోని పెద్దకోన అటవీప్రాంతంలో 14 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు రేంజ్ అధికారి నాగరాజు బుధవారం తెలిపారు. రూ. లక్ష విలువైన ఈ దుంగలను ఆత్మకూరులోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు అనంతసాగరం మండలం గుడిగుంట బీట్ ప్రాంతంలో యాకర్లపాడు సమీపాన అనుమానాస్పదంగా ఉన్న టాటా యుటిలిటి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా పెట్టామని, తమ సిబ్బందిలో కూడా కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నామని, ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందిస్తామని నాగరాజు వెల్లడించారు.
అల్లీపురం చీలురోడ్డు వద్ద..
ఆత్మకూరురూరల్: కడప-నెల్లూరు రహదారిలో ఆత్మకూరు మండలం పరిధిలోని అల్లీపురం చీలు రోడ్డు వద్ద కారులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు ఆత్మకూరు ఎస్సై జి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా మారుతీ కారులో నెల్లూరు వైపు వెళ్తున్న పార్లపల్లి మురళీమోహన్ను అదుపులోకి తీసుకుని 5 ఎర్ర చందనం దుంగలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.