కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ ఆర్ఎం రవివర్మ
రాపూరు: కృష్ణా పుష్కరాలకు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం రవివర్మ తెలిపారు. రాపూరు ఆర్టీసీ డిపోలో జరుగుతున్న ప్రమాదరహిత వారోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలకు 50 సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే 150 బస్సుల వరకు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలు రూ.13.45 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తెలిపారు. రాపూరు డిపో రూ.1.35 కోట్ల నష్టంలో ఉన్నట్లు వివరించారు. నష్టాల్లోని డిపోలను పరిశీలించి ఆదాయ మార్గంలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు కలిసి కట్టుగా పనిచేసి ఆర్టీసీని లాభాలబాటలో నడిపేందుకు కృషి చేయాలని కోరారు. రాపూరు నుంచి చెన్నై, తిరుమలకు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరగా, పరిశీలిస్తామన్నారు. అనంతరం మెకానిక్లు శ్రీధర్, సునీల్, వేణుకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీటీఎం సత్యనారాయణ,డిఎం ఫయాజ్,ఎస్టీఐ శివయ్య,కార్మికులు పాల్గొన్నారు.