నేడు పది ఫలితాలు
సాక్షి, చెన్నై: పదో తరగతి ఫలితాల విడుదలకు రాష్ట్ర పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు ఫలితాలను పరీక్షల విభాగం డెరైక్టర్ వసుంధరా దేవి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగాయి. పది లక్షల 72 వేల 185 మంది రెగ్యులర్, 48 వేల 564 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షా ఫలితాల విడుదలకు ఎన్నికలు కాస్త అడ్డంకిగా మారాయి. ప్లస్‌టూ ఫలితాలు గత వారం విడుదల చేయడంతో, తాజాగా పదో తరగతి ఫలితాల విడుదలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
నుంగంబాక్కంలోని డీపీఐ ఆవరణలో ఉన్న పరీక్షల విభాగంలో డెరైక్టర్ వసుంధరా దేవి ఫలితాల విడుదలకు అన్ని చర్యలు తీసుకున్నారు. సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను తమ నంబర్లతో పాటుగా, పుట్టిన తేదీని టైప్ చేసి ఆన్లైన్లో విద్యార్థులు తెలుసుకోవచ్చు. అలాగే, ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద, పాఠశాలల్లోనూ ఫలితాల్ని తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫలితాలను విద్యార్థులు www. tnresults.nic.in, www.dge1tnnic.in, www.dge2tn.nic.in ద్వారా తెలుసుకోవచ్చు. తాత్కాలిక మార్కుల జాబితాను జూన్ ఒకటో తేదీ నుంచి www.dgetn.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి సంతకాలు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక సప్లిమెంటరీ:
ప్లస్‌టూ ఫలితాలు గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఏడాది కాలం వృధా కాకుండా, ప్రత్యేక సప్లిమెంటరీ నిర్వహిస్తున్నారు. ఆ మేరకు జూన్ 22 నుంచి జూలై నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకు ఆన్లైన్ ద్వారా ఈనెల 27లోపు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని పరీక్షల విభాగం ప్రకటించింది.