Special Survey
-
అస్తవ్యస్తం
గందరగోళంగా రెవెన్యూ రికార్డులు ♦ మూటల్లో మూలుగుతున్న సేత్వార్లు ♦ దస్త్రాల ప్రక్షాళనకు మోక్షమెప్పుడో? ♦ 30శాతం భూముల రికార్డులు మాయం ♦ 26 మండలాలకు 12 మంది సర్వేయర్లు ♦ రికార్డులు లేకుండా ‘రెవెన్యూ ఎర్రర్ ఫ్రీ’! రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించి భూ దస్త్రాలను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సర్వే సెటిల్మెంట్ తర్వాత భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత సరళంగా ఉండేలా చూడాలని యోచిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ‘రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలు’ అంటూ రెవెన్యూ రికార్డులను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. రెవెన్యూ రికార్డులకు ‘బైబిల్’గా చెప్పుకునే సేత్వార్, ఖాస్రా రికార్డులు నిర్వహణ లోపంతో మూటలకు పరిమితమయ్యాయి. సాక్షి, సంగారెడ్డి : నిజాం పాలనా కాలం 1932లో సర్వే సెటిల్మెంట్ అనంతరం సర్వే నంబరు, విస్తీర్ణం, యజమాని, భూమి, పంట రకం, కొలతలు, హద్దులు తదితర వివరాలతో కూడిన టిప్పన్ల సమాహారంగా ‘సేత్వార్’ను రూపొందించారు. ఆ తర్వాత తిరిగి 1954–55 మధ్య కాలంలో భూ యజమాన్య హక్కులకు సంబంధించి శాశ్వత రికార్డుగా పేర్కొం టూ ‘ఖాస్రా పహాణీ’ రూపొందించారు. సేత్వార్, ఖాస్రా పహాణీల నిర్వహణలో నిర్లక్ష్యంతోప్రస్తుతం 30శాతం భూముల వివరాలకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు, లెక్కలు లేకుండా పోయాయి. సేత్వార్లను కంప్యూటరీకరించేందుకు 2005–2007లో చేసిన ప్రయోగం.. విఫలమై రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. జిల్లాలో శ్రేయ, రాశి అనే ప్రైవేటు ఏజెన్సీలకు సేత్వార్లను జిరాక్సు తీసే బాధ్యత అప్పగించగా.. సిబ్బంది నిర్లక్ష్యంతో దశాబ్దాల చరిత్ర కలగిన సేత్వార్ కాపీలు చిరిగి పొడిలా తయారయ్యాయి.దీంతో కాగితాలను మూటల్లో కట్టి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో నేలపైనే పెట్టారు. సుమారు 30శాతం భూములకు సంబంధించి సేత్వార్ రికార్డులు లేకపోవడాన్ని అక్రమార్కులు ఆసరాగా తీసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సేత్వార్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకున్నా తమ వద్ద సేత్వార్ లభ్యం కాలేదంటూ సర్వే ల్యాండ్ రికార్డు కార్యాలయం సమాధానం ఇస్తోంది. పీడిస్తున్న సర్వేయర్ల కొరత ప్రస్తుతం జిల్లాలో 26 మండలాలకు 12 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఐదు చోట్ల ఐదుగురు లైసెన్స్డ్ సర్వేయర్లకు అవసరాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. భూముల సర్వే కోసం యజమానులు దరఖాస్తు చేసుకున్నా సర్వేయర్ల కొరత కారణంగా నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి లైసెన్స్డ్ లేదా ప్రైవేటు సర్వేయర్లతో కొలతలు వేయించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు సర్వేయర్లు లేక భూ వివాదాలు ఏళ్ల తరబడి కొలిక్కి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే సెటిల్మెంట్ నిర్వహించి భూ దస్త్రాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దస్త్రాల ప్రక్షాళనకు సంబంధించి మార్గదర్శకాలు అందాల్సి ఉందని రెవెన్యూ ఉన్నతాధికారులు వెల్లడించారు. తప్పుల తడకగా రికార్డులు జిల్లాలో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాల పేరిట రెవెన్యూ యంత్రాంగం రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దుతోంది. ఇప్పటికే వంద గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రకటించారు. మరో రెండు వందల గ్రామాలను త్వరలో ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారు. రైతుల వద్ద ఉండే పట్టాదారు పాసుపుస్తకాలు, ప్రభుత్వం వద్ద ఉండే రెవెన్యూ రికార్డుల్లో వివరాలు ఒకే రకంగా ఉండేలా చూడటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఏళ్ల తరబడి భూ రికార్డుల ప్రక్షాళన శాస్త్రీయంగా జరగకపోవడంతో భూ సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయి. గ్రామ కంఠాల ఆక్రమణ, చెరువులు, కుంటల హద్దులు చెరిపివేయడం, ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణ, అసైన్డ్ భూముల అక్రమాలు, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు.. ఇలా సవాలక్ష కారణాలతో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో క్షేత్ర స్థాయిలో భూ యజమానుల వద్ద ఉన్న రికార్డులకు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలకు పొంతన లేకుండా పోయింది. మరోవైపు భూ కొలతలకు సంబంధించి డీ అండ్ ఓ, మరాఠ్వాడ విధానాలను అనుసరించడంతో రెవెన్యూ రికార్డులు మరింత సంక్లిష్టంగా తయారయ్యాయి. భూముల విస్తీర్ణం (హెక్టార్లలో) అటవీ భూమి 23,358 సాగులో ఉన్నది 2,34,575 దీర్ఘకాలంగా పడావుగా ఉన్న భూమి 30,416 బీడు, వ్యవసాయ యోగ్యం కానిది 19,512 పచ్చిక బయళ్లు 11,860 వివిధ రకాల వృక్షాలతో కూడినవి 1,490 సాగు యోగ్యమే కానీ నిరుపయోగం 7,340 ఏడాదిగా పడావుగా ఉన్న భూమి 67,847. -
తమ్ముళ్లకే ప్రోత్సాహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం కల్పించిన రాయితీలు పక్కదారిపట్టాయి. అర్హులే కాకుండా అనర్హులకూ జాబితాల్లో చోటు కల్పిస్తూ తెలుగుదేశం నాయకులు తమ అనుయాయులకు ఇతోథిక సాయం అందించారు. ఏళ్ల తరబడి తాము నష్టాల్లో ఉన్నామని, రాయితీలు కల్పిస్తేనే పరిశ్రమల్ని కొనసాగించగలం అని పేర్కొన్న 8మంది పారిశ్రామిక వేత్తలకు దొడ్డిదారిలో కోట్లాది రూపాయలు రాయితీ పేరిట అప్పగించేశారన్న ప్రచారం జరుగుతోంది. విద్యుత్ సదుపాయంతో పాటు తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును సకాలంలో కట్టలేకపోయామని, రకరకాలుగా తాము నష్టపోయామని విన్నవించుకోవడం... వెనువెంటనే స్పందించిన ప్రభుత్వం వారికి లబ్ధి కల్పించేయడం చకచకా సాగిపోయాయి. కొత్తగా పరిశ్రమలు పెడదామని వచ్చేవాళ్లకు మొండిచేయి చూపుతున్న జిల్లా యంత్రాంగం రాయితీల విషయంలో ఎందుకంత చొరవ చూపించిందన్నది అంతుచిక్కడంలేదు. అసలేం జరిగిందంటే... రాష్ట్రస్థాయిలో పారిశ్రామిక విధానంలో మార్పులకోసం ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రత్యేక సర్వే చేపట్టింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో స్థానంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు వ్యాపారులు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలంటే వివిధ విభాగాల చుట్టూ తిరక్కుండా ఆన్లైన్లోనే మొత్తం కార్యకలాపాలు పూర్తయ్యే వ్యవస్థను అందుబాట్లోకి తెచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న చిన్న, కుటీర, మధ్య, భారీ పరిశ్రమల వివరాల్ని సేకరించింది. ఆయా పరిశ్రమలు చాన్నాళ్లు నష్టాల పేరిట ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ వచ్చిన విషయాన్ని గుర్తించింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన బడా పారిశ్రామిక వేత్తలతో పాటు పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉన్న చిన్న వ్యాపారులూ ఉన్నారు. వెంటనే పాలసీలో మార్పులు మొదలయ్యాయి. వ్యాపారుల్ని ప్రోత్సహిస్తామంటూ పాత బకాయిల్ని ఒకేసారి రద్దు చేయాల్సిన అవసరంపై ప్రభుత్వం ఆగమేఘాలమీద అధికారులతో చర్చించి నిర్ణయాలు సైతం తీసుకుంది. ఇలా జిల్లా వ్యాప్తంగా 8మంది టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపారులను ఎంపిక చేసి కోట్లాది రూపాయల్ని రాయితీగా అందించేసింది. వాస్తవానికి కొన్ని పరిశ్రమలు ఎప్పటినుంచో మూతపడ్డాయి. మరికొన్నయితే చిన్నచిన్న పరిశ్రమలుగానే ఉన్నప్పటికీ వాటికీ భారీ నష్టాలు చూపించేశాయి. ఇంకా కొందరైతే లాభాలు వస్తున్నా తప్పుడు లెక్కలతో నష్టాలు చూపించి సర్కారు సాయం నొక్కేశారు. కోటబొమ్మాళి మండలం గంగరాం ప్రాంతంలోని ఓ పరిశ్రమ యజమాని భారీగా రాయితీ పొందారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి ఈ సంస్థకు భాగస్వామి. వీరంతా జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత మనుషులని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు. సునీతను అక్కా అని కూడా సంబోధిస్తారని తెలిసింది. పార్టీలో ఈయనకు పదవి లేనప్పటికీ భారీగా లబ్ధి పొందేందుకు తెలుగుదేశం నాయకుల ఒత్తిళ్లే కారణమని తెలిసింది. టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఓ వ్యక్తికి గ్రానైట్ పాలిష్ చేసే సంస్థ ఉంది. ఆ సంస్థ పొందిన రాయితీ సుమారు రూ. 32లక్షలు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడి సొంత మండలం కోటబొమ్మాళి ప్రాంతంలో ఉన్న మరో రెండు సంస్థల్లోనూ ఈ వ్యక్తికి వాటాలున్నట్టు తెలిసింది. టీడీపీతో ఉన్న సంబంధాలతోనే ఈయన రాయితీ పొందినట్టు చెబుతున్నారు. వీరికే కాకుండా జిల్లాలో మరో ఆరుగురికి ఎలాంటి అర్హతా లేకపోయినా రాయితీ జాబితాలో చోటు కల్పించి భారీగా లబ్ధి చేకూర్చినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త పాలసీ ఎక్కడ? పరిశ్రమలు నెలకొల్పి తద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పారిశ్రామిక విధానంలో మార్పులు తెచ్చి ఇటీవలే ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి తెచ్చింది. గతంలో ఉన్న సింగిల్ విండో స్థానంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తెచ్చినా అందుకనుగుణంగా అధికారుల్లో ఉత్సాహం నింపలేదు. ఫలితంగా ఔత్సాహికులు తమకు పరిశ్రమలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ విధమైన అవకాశం కల్పించే విధంగా పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులే చెబుతున్నారు. భారీ పరిశ్రమలు స్థాపించాలంటే ఔత్సాహికులు ‘స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ కమిటీ(ఎస్ఐపీసీ)ని ఆశ్రయిస్తే సరిపోయేది. ఇప్పుడు దాని స్థానంలో ‘స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్’(ఎస్ఐపీబీ)ని తెచ్చింది. జిల్లాలో ఎక్కడ ఏ పరిశ్రమ స్థాపించాలన్నా ఇక్కడి అధికారుల్ని సంప్రదించకుండానే హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు. గడువులోగా అనుమతులతో కూడిన ధ్రువపత్రాలు సిద్ధమైపోతాయి. దీనిపై సరైన విధివిధానాలు ప్రకటించకపోవడంతో ద రఖాస్తులకు మోక్షం కలగడంలేదు. -
ప్రత్యేక సర్వే
ఇన్నాళ్లూ ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్ల వెంట కంప చెట్లను తొలగించి కూలీలకు పని కల్పించేవారు. ఇక ఇలాంటి పనులకు స్వస్తి పలకాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు, కంటికి కనిపించే పనులు, జీవ న ప్రమాణాలు పెంచే విధంగా ఉండే పనులు గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేయనున్నారు. ఇందుకో సం జిల్లాలో పేదరికం అధికంగా ఉన్న, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న 10 మండలాలను కేం ద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా మండలాల్లో ప్రతి గ్రామానికి ఎనిమిదిమంది సభ్యులతో కూడిన బృందం వెళ్లి ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వే ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో ఎలాంటి ప్రయోజనం పొందారు .. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తున్నారు.. ఇంకా ఏయే పనులు కావాలి అనే వివరాలను బృందం సభ్యులు సేకరిస్తారు. గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పిస్తారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలతో కూడిన ప్రణాళికను తయారు చేసి గ్రామ సభలో ఆమోదిస్తారు. ఆ తరువాత మండల సమావేశంలో తీర్మానం చేస్తా రు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆమోదం పొంది 2014-15 ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారు. దీని కోసం ఈనెలాఖరు వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి రిసోర్స్ టీములకు శిక్షణ ఇస్తారు. అదే విధంగా గ్రామ సర్పంచ్‌లకు ఈనెల 28న మండల స్థాయిలో దీనిపై అవగాహన కల్పించనున్నారు. ఇక నుంచి ‘ఉపాధి’లో వీటికి ప్రాధాన్యం సర్వే అనంతరం ఇకనుంచి ఉపాధిహామీ పథకంలో భాగంగా నీటిని సంరక్షించ డం, భూమి అభివృద్ధి పనులు చేపట్టడం, మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, ఐకేపీ సెంటర్ల వద్ద గోదాము ల నిర్మాణం, కొండలు, గట్ల మీద కట్టలు పోసి నీరు ఇంకి పోయే విధంగా చేయడం, కట్టలకు చెట్లు నాటడం, లింకు రోడ్లు వేయడం లాంటి పనులకు ప్రాధాన్యమిస్తారు. ఒక బృందంలో 8 మంది వరకు.. ప్రతి గ్రామంలో సర్వే కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన బృందం పర్యటించనుంది. గ్రామ పరిమాణాన్ని బట్టి సిబ్బంది పాల్గొంటారు. ఒక్కో గ్రామం లో వారం రోజల వరకు కూడా ఉండి ఇంటింటికీ తిరిగి అక్కడ ప్రజలకు కావాల్సిన వివరాలు సేకరిస్తారు. గ్రామ స్థాయిలో నవంబర్ 20లోగా సర్వే పూర్తి చేసి గ్రామ సభలో, ఆ తరువాత మండల సభలో పెడతారు. డిసెంబర్ 15 నాటికి పూర్తి స్థాయి ప్రణాళికను కలెక్టర్‌కు సమర్పించి ఆమోదం పొందాలి. జిల్లా అంతటా సర్వేకు మౌఖిక ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు పది మండలాలనే కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే విధమైన సర్వే చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. కాని క్షేత్రస్థాయిలో సర్వే చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో 10 మండలాల్లో సర్వే చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పది మండలాల్లో సర్వే పూర్తయిన తరువాత జిల్లా అంతటా చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.