
తమ్ముళ్లకే ప్రోత్సాహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం కల్పించిన రాయితీలు పక్కదారిపట్టాయి. అర్హులే కాకుండా అనర్హులకూ జాబితాల్లో చోటు కల్పిస్తూ తెలుగుదేశం నాయకులు తమ అనుయాయులకు ఇతోథిక సాయం అందించారు. ఏళ్ల తరబడి తాము నష్టాల్లో ఉన్నామని, రాయితీలు కల్పిస్తేనే పరిశ్రమల్ని కొనసాగించగలం అని పేర్కొన్న 8మంది పారిశ్రామిక వేత్తలకు దొడ్డిదారిలో కోట్లాది రూపాయలు రాయితీ పేరిట అప్పగించేశారన్న ప్రచారం జరుగుతోంది. విద్యుత్ సదుపాయంతో పాటు తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును సకాలంలో కట్టలేకపోయామని, రకరకాలుగా తాము నష్టపోయామని విన్నవించుకోవడం... వెనువెంటనే స్పందించిన ప్రభుత్వం వారికి లబ్ధి కల్పించేయడం చకచకా సాగిపోయాయి. కొత్తగా పరిశ్రమలు పెడదామని వచ్చేవాళ్లకు మొండిచేయి చూపుతున్న జిల్లా యంత్రాంగం రాయితీల విషయంలో ఎందుకంత చొరవ చూపించిందన్నది అంతుచిక్కడంలేదు.
అసలేం జరిగిందంటే...
రాష్ట్రస్థాయిలో పారిశ్రామిక విధానంలో మార్పులకోసం ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రత్యేక సర్వే చేపట్టింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో స్థానంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు వ్యాపారులు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలంటే వివిధ విభాగాల చుట్టూ తిరక్కుండా ఆన్‌లైన్‌లోనే మొత్తం కార్యకలాపాలు పూర్తయ్యే వ్యవస్థను అందుబాట్లోకి తెచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న చిన్న, కుటీర, మధ్య, భారీ పరిశ్రమల వివరాల్ని సేకరించింది. ఆయా పరిశ్రమలు చాన్నాళ్లు నష్టాల పేరిట ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ వచ్చిన విషయాన్ని గుర్తించింది.
ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన బడా పారిశ్రామిక వేత్తలతో పాటు పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉన్న చిన్న వ్యాపారులూ ఉన్నారు. వెంటనే పాలసీలో మార్పులు మొదలయ్యాయి. వ్యాపారుల్ని ప్రోత్సహిస్తామంటూ పాత బకాయిల్ని ఒకేసారి రద్దు చేయాల్సిన అవసరంపై ప్రభుత్వం ఆగమేఘాలమీద అధికారులతో చర్చించి నిర్ణయాలు సైతం తీసుకుంది. ఇలా జిల్లా వ్యాప్తంగా 8మంది టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపారులను ఎంపిక చేసి కోట్లాది రూపాయల్ని రాయితీగా అందించేసింది. వాస్తవానికి కొన్ని పరిశ్రమలు ఎప్పటినుంచో మూతపడ్డాయి. మరికొన్నయితే చిన్నచిన్న పరిశ్రమలుగానే ఉన్నప్పటికీ వాటికీ భారీ నష్టాలు చూపించేశాయి. ఇంకా కొందరైతే లాభాలు వస్తున్నా తప్పుడు లెక్కలతో నష్టాలు చూపించి సర్కారు సాయం నొక్కేశారు.
కోటబొమ్మాళి మండలం గంగరాం ప్రాంతంలోని ఓ పరిశ్రమ యజమాని భారీగా రాయితీ పొందారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి ఈ సంస్థకు భాగస్వామి. వీరంతా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత మనుషులని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు. సునీతను అక్కా అని కూడా సంబోధిస్తారని తెలిసింది. పార్టీలో ఈయనకు పదవి లేనప్పటికీ భారీగా లబ్ధి పొందేందుకు తెలుగుదేశం నాయకుల ఒత్తిళ్లే కారణమని తెలిసింది.
టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఓ వ్యక్తికి గ్రానైట్ పాలిష్ చేసే సంస్థ ఉంది. ఆ సంస్థ పొందిన రాయితీ సుమారు రూ. 32లక్షలు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడి సొంత మండలం కోటబొమ్మాళి ప్రాంతంలో ఉన్న మరో రెండు సంస్థల్లోనూ ఈ వ్యక్తికి వాటాలున్నట్టు తెలిసింది. టీడీపీతో ఉన్న సంబంధాలతోనే ఈయన రాయితీ పొందినట్టు చెబుతున్నారు. వీరికే కాకుండా జిల్లాలో మరో ఆరుగురికి ఎలాంటి అర్హతా లేకపోయినా రాయితీ జాబితాలో చోటు కల్పించి భారీగా లబ్ధి చేకూర్చినట్టు ప్రచారం జరుగుతోంది.
కొత్త పాలసీ ఎక్కడ?
పరిశ్రమలు నెలకొల్పి తద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పారిశ్రామిక విధానంలో మార్పులు తెచ్చి ఇటీవలే ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి తెచ్చింది. గతంలో ఉన్న సింగిల్ విండో స్థానంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తెచ్చినా అందుకనుగుణంగా అధికారుల్లో ఉత్సాహం నింపలేదు. ఫలితంగా ఔత్సాహికులు తమకు పరిశ్రమలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ విధమైన అవకాశం కల్పించే విధంగా పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులే చెబుతున్నారు. భారీ పరిశ్రమలు స్థాపించాలంటే ఔత్సాహికులు ‘స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్ కమిటీ(ఎస్‌ఐపీసీ)ని ఆశ్రయిస్తే సరిపోయేది. ఇప్పుడు దాని స్థానంలో ‘స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్’(ఎస్‌ఐపీబీ)ని తెచ్చింది. జిల్లాలో ఎక్కడ ఏ పరిశ్రమ స్థాపించాలన్నా ఇక్కడి అధికారుల్ని సంప్రదించకుండానే హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు. గడువులోగా అనుమతులతో కూడిన ధ్రువపత్రాలు సిద్ధమైపోతాయి. దీనిపై సరైన విధివిధానాలు ప్రకటించకపోవడంతో ద రఖాస్తులకు మోక్షం కలగడంలేదు.