భారత్-దక్షిణాఫ్రికా సిరీస్కు ప్రత్యేక టాస్ కాయిన్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా టాస్ కాయిన్ను రూపొందించింది. 20 గ్రాముల బరువు గల ఈ నాణెమును స్వచ్ఛమైన వెండితో బంగారు పూత పూసి తయారు చేయించారు. దీనిపై గాంధీ, దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది.
నాణెం బొమ్మ భాగంపై గాంధీ, మండేలా చిత్రాలను, బొరుసు భాగంపై భారత్, క్రికెట్ సిరీస్ లోగోను ముద్రించారు. శుక్రవారం భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభంకానుంది. రాత్రి 7 గంటల నుంచి ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి టి-20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు ధోనీ, డుప్లెసిస్లతో కలసి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ టాస్ కాయిన్ను ఆవిష్కరిస్తారు. ఈ సిరీస్లో ప్రతీ మ్యాచ్కు ఇదే టాస్ కాయిన్ను ఉపయోగిస్తారు. గాంధీ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఠాకూర్ చెప్పారు.