దేశవ్యాప్తంగా అంబేద్కర్‌కు ఘననివాళి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ప్రధాని మోదీ ముంబైలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 'అంబేద్కర్ విశ్వ మానవుడు..ఆయన జీవితాంతం పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికు ఎంతో పాటు పడ్డారు. ఆయన గొప్ప విద్యావేత్త.. ఆయన స్పూర్తి ఎంతో మందికి ఆదర్శం... జై భీమ్' అని తన ట్విట్టర్లో సందేశమిచ్చారు.
అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహులో గురువారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 'గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్' పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు జయంతి వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాయి.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి సీఎం కేసీఆర్ గురువారం భూమి పూజ చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద కుల రహిత సమాజం కోసం రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ నిర్వహించారు. శాంతిచక్ర ఇంటర్నేషనల్, పలు స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పలు రాజకీయ నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు.
On his Jayanti, I bow to the venerable Dr. Babasaheb Ambedkar. Jai Bhim. pic.twitter.com/oQSkh98ZiU
— Narendra Modi (@narendramodi) 14 April 2016