Special ward
-
గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసులేమీ నమోదు కాలేదు
హైదరాబాద్: ‘కోవిడ్ వైరస్ వ్యాప్తిపై వదంతులు నమ్మవద్దు. ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వేరియంట్‌తో గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చేరారనే ప్రచారం పూర్తిగా ఫేక్. అనవసరంగా భయాందోళన వద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ∙కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వైరస్‌తో గాందీలో ఐదుగురు చేరారనేది పూర్తిగా అబద్ధం. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. రాష్ట్రంలోనే జేఎన్–1 వేరియంట్ కేసు నమోదు కాలేదు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం అలర్ట్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు, సలహాలు అందించింది. రాష్ట్ర వైద్యమంత్రి దామోదర రాజనర్సింహా, ఇతర వైద్య ఉన్నతాధికారులు గాం«దీలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ∙గాంధీ అత్యవసర విభాగంలో గతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పురుషులకు 30, మహిళలకు 20 మొత్తం 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ పాండమిక్ ముగిసన తర్వాత ఎండ్మిక్లో ఒకటి, రెండు కేసులు నమోదు కావడం సర్వసాధారణం. ఈ నెలలో గాం«దీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రానున్న పండగ రోజులు కీలకం.. ∙రానున్న క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలు కీలకం. కోవిడ్ వంటి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్ «ధరించాలి. హ్యాండ్ శానిటైజేషన్ పాటించాలి. ఈ ఏడాది సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో శ్వాసకోశ రుగ్మతలు, ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. నవంబర్, డిసెండర్ నెలల్లో తగ్గుముఖం పట్టాయి. ∙ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ జేఎన్–1 మొదట అమెరికాలో వెలుగుచూసింది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కేరళలో వ్యాప్తిలో ఉంది. రూపాంతరం చెందిన జేఎన్– 1 సబ్ వేరియంట్ సెల్ఫ్ లిమిటింగ్ వైరస్. దానంతట అదే తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రత తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు గుర్తించారు. వీరు జాగ్రత్తగా ఉండాలి.. ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల్లో వ్యాపించిన ఆల్ఫా, డెల్టా కంటే మూడో వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ త్వరితగతిన వ్యాపిస్తుంది. ఒమిక్రాన్ సబ్‌వేరియంటే జేఎన్– 1. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకే అవకాశం ఉంది. వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వైరస్ అన్ని వేవ్‌లు సమ్మర్లోనే ఎక్కువగా వ్యాపించాయి. ► కేరళలో జేఎన్– 1 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములు ముందు జాగ్రత్తలు పాటించాలి. తిరిగి వచి్చన తర్వాత స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ కేసులు పెరిగితే గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మార్గదర్శకాలను అమలు చేస్తాం. ► కోవిడ్ నోడల్ కేంద్రం సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డుతోపాటు, కోవిడ్ పరీక్షలు, పీపీఈ కిట్లు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయి. అసత్య ప్రచారాలు నమ్మవద్దు. భయాందోళనకు గురి కావద్దు. మాస్క్ ధరించి, హ్యాండ్ శానిటైజేషన్, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. -
చైనాలో కరోనా కల్లోలం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు. చైనాలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ ఈ వ్యాధి రేపుతున్న కల్లోలం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసాధారణ రీతిలో కొత్త సంవత్సరం వేడుకల్ని చైనా సర్కార్ రద్దు చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్ భారత్‌నూ భయపెడుతోంది. 13 నగరాలకు రాకపోకలు బంద్ కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం 13 నగరాల్లో రవాణా ఆంక్షలు విధించింది. మొట్టమొదటి సారి ఈ వైరస్ కనిపించిన సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో 13 నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకల్ని నిలిపివేసింది. బస్సులు, రైళ్లను రద్దు చేసింది. దీంతో 4.1 కోట్ల మందిపై ప్రభావం చూపించింది. హుబీ ప్రావిన్స్‌లో హువాన్, దాని చుట్టుపక్కల ఉన్న 13 నగరాల నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పట్టణాల్లో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. కొత్త సంవత్సర వేడుకలకి దూరం చైనాలో శనివారం కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది. గణతంత్ర వేడుకలు కూడా రద్దు ఈ నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషే«ధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిమ్స్‌లో ప్రత్యేక వార్డు కరోనా వైరస్ సోకిందన్న అనుమానం కలిగిన వారికి వైద్యపరీక్షలు, చికిత్సల కోసం రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ (ఎయిమ్స్) ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది ముంబైలో ఇద్దరికి వైద్య పరీక్షలు ముంబై, సాక్షి: చైనా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు జలుబు, దగ్గు ఉండటంతో ముందు జాగ్రత్తగా ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నుంచే ముంబై విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే, చైనాకు వెళ్లి వచ్చిన 80 మందిని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో ఏడుగురికి దగ్గు, జ్వరం, గొంతువాపు ఉండటంతో చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ నుంచి?: ఈ వైరస్ ఎక్కడ నుంచి మనుషులకు వ్యాపించిందో చైనా ఆరోగ్య అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అయితే సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచి వ్యాపించినట్లు భావిస్తున్నారు. వుహాన్‌లోని ఈ మార్కెట్లో చట్టవిరుద్ధంగా పలు అడవి జంతువులను కూడా అమ్ముతుంటారు. క్రెయిట్ పాములు, నాగు పాములు, గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు చైనా శాస్త్రవేత్తల అభిప్రాయం. 10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం! వైరస్ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా ఫీల్డ్ ఆస్పత్రిని వుహాన్‌లో చైనా నిర్మిస్తోంది. కేవలం 10 రోజుల్లో ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు. కాగా, అమెరికాలో రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. చికాగోకు చెందిన 60 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ణయించారు. గత డిసెంబరులో ఈమె వుహాన్‌ను పర్యటించినట్లు తెలిపారు. మరో 50 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. లక్షణాలు తీవ్రమైన జ్వరం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది న్యుమోనియాతో ఊపిరితిత్తుల్లో సమస్యలు కిడ్నీలు విఫలం కావడం మాస్క్‌లు ధరించడం జాగ్రత్తలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం మాంసాహారం మానేయడం లేదా బాగా ఉడికించి తినడం మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం కాళ్లు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం ఉతికిన దుస్తులు ధరించడం వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం దగ్గు, తుమ్ములు వచ్చినపుడు రుమాలు ఉపయోగించడం వన్యప్రాణులకు దూరంగా ఉండటం వుహాన్‌లో నిర్మించనున్న ఆస్పత్రి కోసం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న పనులు -
‘అభాగ్యులకోసం’ ప్రత్యేకవార్డు
రిమ్స్ ( కడప అర్బన్ ) రిమ్స్‌లో అభాగ్యుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఆర్ఎంఓ డాక్టర్ జంగం వెంకట శివ సోమవారం ఆయా విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించారు. – ఐపీ విభాగంలోని మొదటి అంతస్తులో ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లెకు చెందిన నారాయణ (55) అనే వ్యక్తి అస్వస్థతలో పడి వుండటం గమనించారు. వెంటనే అతన్ని విచారిస్తే తాను ప్రొద్దుటూరు నివాసినని, మా బంధువులు వస్తారనీ తెలిపారు. అతన్ని ప్రత్యేక వార్డులో చేర్పించమని ఆర్ఎంఓ ఆదేశించారు. – క్షయ నివారణ వార్డు బయట కడప మాసాపేటకు చెందిన శివ అనే రోగి ఆరుబయట నిద్రిస్తుండగా అతన్ని ఆర్ఎంఓ విచారించారు. అతను వెంటనే లేచి తాను నెల రోజుల నుంచి క్షయ నివారణ విభాగంలో చికిత్స పొందుతున్నానని తెలిపారు. సరిగా మందులు వాడుతున్నాని మొదట వచ్చినప్పటికీ, ఇప్పటికీ బాగుందని తెలిపారు. – ఐపీ విభాగంలో ఐడి వార్డును ‘అభాగ్యుల కోసం’ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును ఆర్ఎంఓ పరిశీలించారు. మొదట పడక మంచంపై వున్న వ్యక్తిని పలుకరించారు. తన పేరు విజయకుమార్ అని, తనకు పాత బస్టాండ్ సమీపంలో 20 రోజుల క్రితం ప్రమాదం జరిగిందని తెలిపారు. తనను ఆటోలో రిమ్స్‌కు తీసుకుని వచ్చి చేర్పించారని తెలిపారు. ఆ విషయం తన సోదరి లలితమ్మకు కూడా ఇంతవరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచూకీ లేనివారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. -
స్వైన్ పంజా
రాష్ట్రంలో నెలన్నర రోజుల్లో 186 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. వంద మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చెన్నైలో 9 మందికి ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక, శరీరంపై అకస్మాత్తుగా మంటలు లేచి వింత వ్యాధితో బాధపడుతున్న విల్లుపురానికి చెందిన మగ శిశువు కోలుకున్నాడు. సాక్షి, చెన్నై: రాష్ర్టంలో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్ని వెంటాడుతోంది. ఈ ఫ్లూను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చే స్తోంది. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు,గ్రామాల్లో ఆరోగ్య భద్రతా కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు జ్వరంతో ఇక్కడికి వస్తున్నారా? అని పరిశీలించేందుకు ప్రతి ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రత్యేక శిబిరాల్ని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలన్నరలో 186 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డట్టుగా ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. జిల్లాల వారీగా సేకరించిన సమాచారాల మేరకు ఈ వివరాలను ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగా కొన్ని స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. గత నెల 86 కేసులు నమోదు కాగా, ఈ నెలలో వంద కేసులు నమోదైనట్టు వివరించారు. గత నెల ఆస్పత్రుల్లో చేరిన వారు కోలుకున్నారని, వంద మందికి ఆయా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వివరించారు. గత నెల నమోదైన కేసుల్లో 11 మంది వారి ఇళ్ల వద్దే ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చెన్నై విషయానికి వస్తే ప్రస్తుతం 9 మంది ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరికి మెరుగైన వైద్య చికిత్సల్ని అందిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నెలన్నర కాలంగా 8 మంది ఈ ఫ్లూతో మరణించారని స్పష్టం చేశారు. ఎవరైనా జ్వరం బారిన పడితే, తక్షణం స్వైన్ ప్లూ సంబంధిత పరీక్షలు చేసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్ని సంప్రదిస్తే ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. స్వైన్ ఫ్లూ నివారణ లక్ష్యంగా అవగాహనా కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నామని వివరించారు. కోలుకున్న శిశువు : విల్లుపురం జిల్లా మైలం సమీపంలోని నొడి గ్రామానికి చెందిన కర్ణన్, రాజేశ్వరీ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు మగ పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. వీరి పెద్ద కుమారుడు రాహుల్ పుట్టగానే, వార్తల్లోకి ఎక్కాడు. ఆ శిశువు శరీరం నుంచి మంటలు రావడంతో ఆ వ్యాధి ఏమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. ఎట్టకేలకు వైద్య పరీక్ష అనంతరం రాహుల్ బాగానే ఉన్నాడు. అయితే, గత నెల 9న మూడో బిడ్డకు జన్మనిచ్చిన రాజేశ్వరి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ శిశువు శరీరంలోనూ మంటలు చెలరేగడంతో వైద్య శాస్త్రానికి మళ్లీ పరీక్ష ఎదురైంది. ఆ శిశువు కాళ్లు, తొడ భాగంలో మంటలు రావడం, ఆ భాగాలు కాలడంతో కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ బాలుడికి వైద్య చికిత్సల్ని అందించారు. మెరుగైన చికిత్సల్ని అందించడంతో పాటుగా ప్రతిరోజు 24 గంటలు తమ పర్యవేక్షణలో ఉంచి ఆ శిశువుకు వైద్య బృందం సఫర్యలు చేసింది. వైద్య చికిత్సల మెరుగుతో, మళ్లీ మంటలు రాని దృష్ట్యా, ఆ శిశువు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆ శిశువును శనివారం కీల్పాకం ఆస్పత్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్ పరిశీలించారు. ఆ శిశువు ఆరోగ్యం మెరుగు పడడంతో వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. అయితే, ఆ శిశువును డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారోనన్నది తేలాల్సి ఉంది. -
16 పడకలతో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డు
సాంబమూర్తినగర్ (కాకినాడ) : స్వైన్‌ఫ్లూ నియంత్రణ కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే టీబీ వార్డులో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినా అక్కడ తగినంతగా సౌకర్యాలు లేకపోవడంతో సోమవారం ఈఎన్టీ బ్లాకు మూడో అంతస్తులోకి వార్డును మార్చారు 16 పడకలు, ఆధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. మందులు, 24 గంటలూ పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకట బుద్ధ, ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ కె.లక్ష్మోజీనాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు రెండేళ్ల క్రితం జిల్లాలో స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించడంతో అప్పట్లో దాదాపు 20 వేల మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో నయం చేసి ఇంటికి పంపారు. ఇటీవల చిత్తూరుకు చెందిన ఓ యువతి, రాజమండ్రికి చెందిన యువకుడు స్వైన్‌ఫ్లూ బారిన పడి ఇక్కడికి రావడంతో వారికి కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించారు. ఆ అనుభవంతో స్వైన్‌ఫ్లూపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లోక్‌నాయక్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పీఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సూచనల మేరకు జీజీహెచ్‌లో కూడా అన్ని సౌకర్యాలతో కూడిన ఈఎన్టీ బ్లాకులోని ఆప్తాల్మిక్ విభాగంలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. రోగులను తరలించేందుకు ర్యాంపు, వీల్ చైర్లు, స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలపై సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ ఆరా తీశారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తంగాా వ్యవహరించాలని ఆదేశించారు. పస్తుత వాతావరణ పరిస్థితుల్లో స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం లేకపోయినా, తాము అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం 16 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని పడకలు, మందులు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించామని చెప్పారు. దీనిపై జిల్లా స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ కె.అనితకు సమాచారం అందించామన్నారు. అనుమానితులు ఎవరైనా జీజీహెచ్‌కు వస్తే వారికి వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారినపడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. అపరిచితులకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదన్నారు. జీజీహెచ్‌లో అన్ని మందులూ, మాస్కులు, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ వెల్లడించారు.