సాంబమూర్తినగర్ (కాకినాడ) : స్వైన్‌ఫ్లూ నియంత్రణ కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే టీబీ వార్డులో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినా అక్కడ తగినంతగా సౌకర్యాలు లేకపోవడంతో సోమవారం ఈఎన్‌టీ బ్లాకు మూడో అంతస్తులోకి వార్డును మార్చారు 16 పడకలు, ఆధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. మందులు, 24 గంటలూ పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకట బుద్ధ, ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ కె.లక్ష్మోజీనాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు రెండేళ్ల క్రితం జిల్లాలో స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించడంతో అప్పట్లో దాదాపు 20 వేల మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో నయం చేసి ఇంటికి పంపారు.
ఇటీవల చిత్తూరుకు చెందిన ఓ యువతి, రాజమండ్రికి చెందిన యువకుడు స్వైన్‌ఫ్లూ బారిన పడి ఇక్కడికి రావడంతో వారికి కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించారు. ఆ అనుభవంతో స్వైన్‌ఫ్లూపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లోక్‌నాయక్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పీఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సూచనల మేరకు జీజీహెచ్‌లో కూడా అన్ని సౌకర్యాలతో కూడిన ఈఎన్‌టీ బ్లాకులోని ఆప్తాల్మిక్ విభాగంలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. రోగులను తరలించేందుకు ర్యాంపు, వీల్ చైర్లు, స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలపై సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ ఆరా తీశారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తంగాా వ్యవహరించాలని ఆదేశించారు.
పస్తుత వాతావరణ పరిస్థితుల్లో స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం లేకపోయినా, తాము అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం 16 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని పడకలు, మందులు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించామని చెప్పారు. దీనిపై జిల్లా స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ కె.అనితకు సమాచారం అందించామన్నారు. అనుమానితులు ఎవరైనా జీజీహెచ్‌కు వస్తే వారికి వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారినపడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. అపరిచితులకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదన్నారు. జీజీహెచ్‌లో అన్ని మందులూ, మాస్కులు, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ వెల్లడించారు.
16 పడకలతో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డు
Published Tue, Feb 3 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement