పడగనీడ పరుచుకున్నా..అప్రమత్తత సున్నా | two swine flu cases in Kakinada | Sakshi
Sakshi News home page

పడగనీడ పరుచుకున్నా..అప్రమత్తత సున్నా

Published Sun, Jan 11 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

పడగనీడ పరుచుకున్నా..అప్రమత్తత సున్నా

పడగనీడ పరుచుకున్నా..అప్రమత్తత సున్నా

 కాకినాడ క్రైం :స్వైన్ ఫ్లూ.. ఒకరి నుంచి ఒకరికి తేలికగా సోకే వ్యాధి. సకాలంగా గుర్తించకపోయినా, సక్రమంగా వైద్యం అందకపోయినా ప్రాణాలకు ముప్పు తెచ్చే మహమ్మారి. జిల్లాలో ఇద్దరు స్వైన్ ఫ్లూ పీడితులు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం జిల్లా అంతటా కలవరం రేపుతుండగా.. వ్యాధి నిరోధానికి పూనిక వహించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల్లో మాత్రం చలనం కానరావడం లేదు. వ్యాధి నిరోధానికి చేయాల్సిన హెచ్-1ఎన్-1 వ్యాక్సిన్ జిల్లాలో నిల్వ లేకపోవడమే అందుకు సాక్ష్యం. దీంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రోగులు, వైద్య సిబ్బంది భయపడుతున్నారు.
 
 చిత్తూరుకు చెందిన ఓ యువతి, రాజమండ్రికి చెందిన ఓ యువకుడు స్వైన్ ఫ్లూ బారిన పడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్యం అందించే వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా హెచ్1ఎన్1 వ్యాక్సిన్ అందించాలి. అయితే జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ వద్ద హెచ్1ఎన్1 వ్యాక్సిన్ నిల్వ లేదు. అంతేకాక స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానం వచ్చిన వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన స్ట్రిప్పుల ద్వారా గొంతు, ముక్కుల నుంచి కళ్లె సేకరించి, ప్రత్యేక కంటైనర్లలో భద్రపరిచి హైదరాబాద్‌లోని లేబ్‌కు పంపాలి. అయితే వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంతో అవి కూడా ప్రస్తుతం నిండుకున్నాయి.
 
 కాగా స్వైన్ ప్లూ బాధిత యువకుడిది రాజమండ్రి కావడంతో అతని ద్వారా పరిసరాల్లో ఎవరికైనా వ్యాధి సోకిందో, లేదో తెలుసుకునే విషయంలో కూడా వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగానే ఉంది. అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జీజీహెచ్‌లో వేల మంది చికిత్స పొందుతుంటారు. వారి కోసం రోజూ దాదాపు ఐదు వేల మంది సందర్శకులు వస్తుంటారు. స్వైన్ ఫ్లూ బాధితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండడంతో ఆస్పత్రికి వచ్చే వారు మాస్కులు ధరిస్తున్నారు. మాస్కులు లేని వారు నోటికి రుమాలు అడ్డుపెట్టుకుంటున్నారు. స్వైన్ ఫ్లూ వార్డు సాధారణ వార్డులకు దూరంగా ఉన్నప్పటికీ రోగులు, సందర్శకులు బెంబేలెత్తుతున్నారు.
 
 నిర్వీర్యమైన ఎపిడమిక్ సెల్
 స్వైన్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన ఎపిడమిక్ సెల్‌ను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్వీర్యం చేశారు. అన్ని ప్రాంతాల్లో వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేయాల్సిన ఎపిడమిక్ సెల్ సిబ్బందిని డీఎంహెచ్‌ఓ సీసీలుగా, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం విభాగంలో డిప్యుటేషన్‌పై నియమించారు. దీంతో ప్రస్తుతం ఎపిడమిక్ సెల్ పూర్తిగా కనుమరుగైపోయింది.
 
 మత్స్యకారవాడల్లో భయాందోళనలు
 జిల్లాలో సుమారు 144 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. తీరంలో 12 మండలాల్లో పలు గ్రామాలు, మత్స్యకారవాడల్లో వేల మంది జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం తాళ్లరేవు మండలం చినబొడ్డు వెంకటాయపాలెం, పరిసర ప్రాంతాలను స్వైన్ ఫ్లూ వణికించింది. తాజాగా జిల్లాలో స్వైన్ ఫ్లూ బాధితులు చికిత్స పొందుతుండడంతో మత్స్యకారవాడల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
 
 పరిస్థితి అదుపులోనే : జీజీహెచ్‌సూపరింటెండెంట్
 జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువతీ, యువకుల పరిస్థితి అదుపులోనే ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ తెలిపారు. ఆయన శనివారం సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ స్వప్నకుమారి, ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ మూర్తి తదితరులతో స్వైన్ ఫ్లూ వార్డును సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు. రెండు వెంటిలేటర్లు పూర్తిగా వారికి కేటాయించినట్లు చెప్పారు. స్వైన్ ఫ్లూ కారణంగా హైదరాబాద్‌లో ముగ్గురు మరణించడంతో దాదాపు 15 రోజుల నుంచి అప్రమత్తంగా ఉన్నామని, వివిధ విభాగాల అధిపతులతో వారానికోమారు సమీక్ష నిర్వహించి ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. మందులు, మాస్క్‌లు, యాంటీ బయాటిక్స్ అందుబాటులో ఉంచామన్నారు. స్వైన్ ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావుకు సూచనలిచ్చి, మెడిసిన్, అనస్థీషియా, మైక్రోబయాలజీ వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్‌లతో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. బాధితులకు డాక్టర్ రాఘవేంద్రరావు నేతృత్వంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శేషగిరి, జూనియర్ డాక్టర్లు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement