29న ప్రత్యూష డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష బుధవారం డిశ్చార్జ్ అవుతారని, అందువల్ల ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరచలేకపోయామని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. కోర్టుకు వచ్చేందుకు ప్రత్యూష సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ కోర్టుకు నివేదించారు. అయితే ఆమెను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్‌కు తీసుకురావాలని ధర్మాసనం సూచించింది.
ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, మీడియా ద్వారా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యూషను ఆమె సవతి తల్లి, కన్నతండ్రి తీవ్రంగా హింసించిన వార్తలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటోగా రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేర జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ ప్రారంభించారు.