ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ జోరు
కరోనా మహమ్మారి తదుపరి ప్రపంచ కెమికల్ దిగ్గజాలు సరఫరాల చైన్‌ను పునర్వ్యవస్థీకరించే సన్నాహాలు ప్రారంభించాయి. తద్వారా చైనాయేతర దేశాల కంపెనీలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు సామర్థ్య విస్తరణను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు మరింత మెరుగైన పనితీరు చూపే వీలున్నట్లు పలువురు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..
దేశీయంగా టాప్ పొజిషన్లో ఉన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు కొంతకాలంగా విస్తరణ కార్యకలాపాలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రొడక్టుల లభ్యత పెరగనుంది. మరోవైపు కోవిడ్–19 తదుపరి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, ఆర్థిక వ్యవస్థలు పురోగమన పథం పట్టడం వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్ పరిశ్రమ సైతం చేరనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి పలు గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. రిస్కులను తగ్గించుకునే వ్యూహాలు దీనికి కారణంకాగా.. ఇందుకు అనుగుణంగా భారత్ వంటి దేశాలవైపు చూస్తున్నా యి. ఇదే సమయంలో పలు అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనూ డిమాండుపై అంచనాలతో దేశీ కంపెనీలు తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ రావడం మరిన్ని అవకాశాలకు దారిచూపనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి స్పెషాలిటీ కెమికల్స్‌కు పెరగనున్న డిమాండును అందుకునే బాటలో దేశీ పరిశ్రమ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు.
చైనాకు చెక్
కోవిడ్–19 సవాళ్ల తదుపరి ఏడాది కాలంగా స్పెషాలిటీ కెమికల్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఓవైపు చైనాకు ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా ఇతర దేశాల కంపెనీలపై గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు దృష్టిసారిస్తుంటే.. మరోపక్క యూరోపియన్ కెమికల్ దిగ్గజాలు భారత్ మార్కెట్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు ప్రధానంగా యూరోప్‌లో తయారీ వ్యయ, ప్రయాసలతో కూడుకోవడం ప్ర భావం చూపుతోంది. భారత్ నుంచి చౌకగా ప్రొడక్టులను ఔట్సోర్సింగ్ చేసుకునేందుకు వీలుండటం ఇందుకు సహకరిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. నిజానికి ఈ రంగంలో దేశీయంగా పలు కంపెనీలు ప్రొడక్టులను భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఇకముందు ఔట్సోర్సింగ్ మరింత పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కొత్త మాలిక్యూల్స్..
కొద్ది రోజులుగా స్పెషాలిటీ కెమికల్ తయారీ ముడివ్యయాలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికితోడు ఇంధన వ్యయాలూ దిగివస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా కొత్త మాలిక్యూల్స్, ప్రాసెస్‌పై కొన్ని కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతేకాకుండా సొంతంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, దిగుమతి ప్రొడక్టులకు ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తద్వారా గ్లోబల్ దిగ్గజాల నుంచి దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులను పొందడంపై కన్నేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.
షేర్లపై ఎఫెక్ట్
పటిష్ట అమ్మకాలు సాధిస్తున్న స్పెషాలిటీ కెమికల్ కంపెనీల స్టాక్స్ గత కొన్నేళ్లుగా లాభాలతో దూసుకెళ్లడంతో ఇటీవల కొంతమేర దిద్దుబాటును చవిచూస్తున్నాయి. గత 5–7 ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే పలు దిగ్గజాల షేర్లు రెటింపునకుపైగా బలపడ్డాయి. అయితే కొద్ది నెలలుగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక మందగమన భయాలు వంటి ప్రతికూలతలతో వెనకడుగు వేస్తున్నాయి. 52 వారాల గరిష్టాలతో పోలిస్తే ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రైట్, ఆర్తి ఇండస్ట్రీస్, ఆల్కిల్ అమైన్ కెమికల్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ తదితర షేర్లు 20–40 శాతం మధ్య పతనమయ్యాయి. అయినప్పటికీ ఐదేళ్ల సగటు ధరలతో చూస్తే ప్రీమియంలోనే ట్రేడవుతున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ ఆర్జనలపట్ల ఆశావహ అంచనాలు సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఇటీవల త్రైమాసిక ఫలితాలలో పీఐ ఇండస్ట్రీస్ ఆదాయం జంప్‌చేయగా.. రిఫ్రిజిరెంట్ గ్యాస్ ధరలతో గుజరాత్ ఫ్లోరో, ఎస్ఆర్ఎఫ్ లబ్ది పొందే వీలుంది. ఎఫ్ఎంసీజీ రంగం ద్వారా గలాక్సీ, ఫైన్ ఆర్గానిక్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. ఇక దీపక్, ఆర్తి, జూబిలెంట్ కొంతమేర మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ప్రొడక్టుల ద్వారా పనితీరు మెరుగుకానున్నట్లు అభిప్రాయపడ్డారు.
యాజమాన్యాలు రెడీ
దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ భారీఎత్తున పెరుగుతోంది. అయినప్పటికీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, దీపక్ నైట్రైట్ తదితరాలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చని అంచనా. ఇక ఆర్తి ఇండస్ట్రీస్, నోసిల్, వినతీ ఆర్గానిక్స్, గలాక్సీ సర్ఫక్టాంట్స్, టాటా కెమికల్స్, అనుపమ్ రసాయన్ తదితర దిగ్గజాల యాజమాన్యాలు గ్లోబల్ సరఫరా చైన్ల పునర్వ్యవస్థీకరణతో భారీగా లబ్ది పొందే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. వెరసి ఈ రంగంలోని పలు దిగ్గజాలు భవిష్యత్‌లో పటిష్ట పనితీరును ప్రదర్శించే అవకాశముంది.