సర్కారీ వైద్యం సూపర్
మదనపల్లె: గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యం అంటే ప్రజలు భయపడే పరిస్థితి. ప్రాణాపాయ స్థితిలో అత్యవసరంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే వైద్యులు అందుబాటులో లేకపోవడం, ప్రమాదకర పరిస్థితుల్లో వైద్యం అందించలేమంటూ తిరుపతి, బెంగళూరు, వేలూరు ఆస్పత్రులకు రెఫర్ చేసేవారు. అరకొర వసతులతో సామాన్యులకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యరంగానికి మహర్దశ పట్టింది.
పేదవాడికి కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పథకంతో మౌలికవసతులు, కోట్లాదిరూపాయలు వెచ్చించి అధునాతన పరికరాలు, ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాల ప్రజల వైద్య అవసరాలకు ఏకైక పెద్దదిక్కు మదనపల్లె జిల్లా ఆస్పత్రి.
2019 వరకు మదనపల్లె జిల్లా వైద్యశాలలో 15 నుంచి 20 మంది మాత్రమే డాక్టర్లు ఉండేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ గిరీషా.పీఎస్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా, ఎమ్మెల్యే నవాజ్‌బాషా కో చైర్మన్‌గా ఉన్నారు. ఆస్పత్రి సమస్యలను ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషిచేయడంతో నేడు జిల్లా ఆస్పత్రిలో 34మంది వైద్యులు సేవలందిస్తున్నారు.
కార్పొరేట్ ఆస్పత్రిలో లభించే ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతిరోజు 700 నుంచి 800 వరకు ఔట్పేషెంట్లు వైద్యచికిత్సలు పొందుతున్నారు. 150 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆప్తాల్మజీ, ఆర్థో, ఈఎన్టీ, సైకియాట్రి, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజీషియన్ మెడిసిన్, గైనకాలజీ, రేడియాలజీ, పిడియాట్రిక్, ఏ.ఆర్.టి.(హెచ్ఐవీ) సెంటర్, టీబీ, డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్యులు సేవలందిస్తున్నారు.
రాష్ట్రంలోనే మంచిపేరున్న బ్లడ్‌బ్యాంక్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. ప్రతిరోజు నాలుగు షిఫ్ట్‌లలో నెలకు 100మందికి పైగా కిడ్నీవ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు డయాలసిస్ సెంటర్ ఉంది. పాయిజన్, హార్ట్‌స్ట్రోక్స్, ఇతర అత్యవసరాలకు సంబంధించి 10 బెడ్లతో ఐసీయూ, పుట్టిన పిల్లలకు తక్షణ వైద్యసేవలకు సిక్ న్యూ బార్న్ యూనిట్లో 10 బెడ్లను ఏర్పాటు చేశారు.
డీఎన్బీ కింద గైనిక్, అనస్థీషియా విభాగాలకు సంబంధించి ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులను ప్రభుత్వం కేటాయించింది. 24 గంటలు అత్యవసర వైద్యసేవలు అందేలా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈసీజీ, వెంటిలేటర్లు, కంప్లీట్ ఆటోఅనలైజర్, డయాలసిస్, హార్మోన్ ఎనలైజర్ మిషన్లు, స్కానింగ్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా వైద్యశాలలో త్వరలో బ్రెస్ట్ క్యాన్సర్, ఇతరాలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
8కోట్ల రూపాయల అభివృద్ధి పనులు
గడచిన రెండున్నరేళ్లలో జిల్లా వైద్యశాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎంపీ మిథున్‌రెడ్డి సొంత నిధులతో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లను హైదరాబాదు నుంచి తెప్పించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.
ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఎంపీ సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్–1, పీఎస్ఏ ప్లాంట్లు–2 మొత్తం మూడింటిని ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా వీటిద్వారా 100 బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 10 ఐసీయూ బెడ్లు, 0–8 సంవత్సరాల పిల్లలకు సేవలందించేందుకు డీఐసీకు శాశ్వత భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. కరోనా టెస్టులు చేసేందుకు వీఆర్డీఎల్ ల్యాబ్ ఉంది.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాము. సిబ్బంది కొరత లేకుండా అన్ని విభాగాలకు డాక్టర్లను నియమించాం. జిల్లా ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్వయంగా పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన పేదవాడు ఇక్కడ అందే ఉచిత వైద్యంతో ఆరోగ్యంగా ఇంటికెళ్లాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నాం.
–నవాజ్‌బాషా, ఎమ్మెల్యే
అందుబాటులో స్పెషాలిటీ వైద్యసేవలు
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది కొరత లేదు. గైనకాలజీ విభాగంలో నెలకు 300 వరకు కాన్పులు, ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలకు సంబంధించి అక్టోబర్‌కు సంబంధించి 2వ ర్యాంకును సాధించాం.
– డాక్టర్ ఆంజనేయులు, మెడికల్ సూపరింటెండెంట్
రోగులకు మంచి వైద్యం అందుతోంది
మాది నిమ్మనపల్లె మండలం దిగువపల్లె గ్రామం. పక్షవాతంతో బాధపడుతున్నాను. ఐదురోజుల క్రితం ఆయాసం, గొంతు, వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ గతంతో పోలిస్తే ప్రస్తుతం మంచి వైద్యం అందుతోంది. సౌకర్యాలు బాగున్నాయి.
– శివకుమార్ సింగ్, దిగువపల్లె, నిమ్మనపల్లె