అంత్య పుష్కరాలకు వచ్చేవారికి అన్ని వసతులు కల్పించాలి
► ఐటీడీఏ పీఓ రాజీవ్
భద్రాచలం :
అంత్య పుష్కరాలకు వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ పీఓ, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. గోదావరి స్నానఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రాచలంలోని గోదావరి కరకట్ట పరిసరాలను ఆయన బుధవారం పరిశీలించారు. స్నానఘట్టాల వద్ద మెట్లపై పేరుకుపోయిన ఒండ్రు మట్టిని త్వరితగతిన తొలగించాలన్నారు. గోదావరిలో స్నానానికి లోతుకు వెళ్లకుండా బారికేడ్లు నిర్మించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ డీఈని ఆదేశించారు. మహిళలు బట్టలు మార్చుకునే తాత్కాలిక గదులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలన్నారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిర్ణీత ప్రదేశాల్లో స్నానాలు చేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు స్నానాలు చేసే ప్రదేశాల్లో పడవలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని డీఎల్పీఓ ఆశాలతకు సూచించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పీఓ వెంట ఏఎస్పీ భాస్కరన్, తహశీల్దార్ రామకృష్ణ, డీఈ శ్యాంప్రసాద్, ఎస్సై కరుణాకర్, దేవస్థానం డీఈ రవీందర్, జీపీ ఈఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ శైలజ పాల్గొన్నారు.