sperm bank
-
ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ
సాక్షి, హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో ఆ దంపతులు భద్రపరుచుకున్న స్పెర్మ్.. ఇప్పుడు వారికి పండంటి బిడ్డను ప్రసాదించింది. కేన్సర్ చికిత్సకు వెళ్లే ముందు వైద్యుల సలహా మేరకు ఆయన తన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. దాన్ని వినియోగించిన ఐసీఎస్ఐ (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్) ద్వారా ఇప్పుడు వారు తల్లిదండ్రులయ్యారు. 2012లో 23 ఏళ్ల కార్తీక్ (పేరు మార్చాం)కు వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్ ట్యూమర్ (కేన్సర్)తో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చికిత్సలో ఎదురయ్యే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని.. అతడి వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకోమని వైద్యుడు సలహా ఇచ్చారు. దీంతో 2012లో కేన్సర్ చికిత్స ప్రారంభానికి ముందు కార్తీక్ తన వీర్యాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్యాంకులో భద్రపరిచాడు. సంవత్సరం క్రితం ఆయన కేన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే.. కిమోథెరపీ, రేడియోథెరపీ మోతాదుల కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో భద్రపరిచిన వీర్యం ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు.. ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించారు. ఐసీఎస్‌ఐను మాక్స్(మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని తయారుచేసి.. మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. అలా గర్భం దాల్చిన ఆ మహిళ గత వారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి తల్లిబిడ్డలు డిశ్చార్జయ్యారు. -
పెళ్లికి ముందు కూడా.. స్పెర్మ్‌కూ ఓ బ్యాంకు!
సాక్షి, అమరావతి బ్యూరో: చేతినిండా సొమ్మున్నప్పుడు బ్యాంక్‌లో దాచుకుని అవసరమైనప్పుడు వాడుకుంటాం. అదేవిధంగా యుక్త వయసులో ఉండే వీర్యకణాలు, అండాలనూ బ్యాంక్‌లో డిపాజిట్ చేసి.. కావాలనుకున్నప్పుడు విత్ డ్రా చేసుకుని పిల్లల్ని కనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆశ్చర్యం అనిపిస్తున్నా.. ఇది ముమ్మాటికీ నిజం. ‘స్పెర్మ్ బ్యాంక్’లుగా పిలిచే ఈ నూతన సాంకేతిక పద్ధతులపై యువ దంపతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు మన చెంతకూ వచ్చింది. సహజంగా 30 ఏళ్లు దాటాక పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తి అవకాశాలు సన్నగిల్లుతాయి. వయసు పెరిగేకొద్దీ పురుషుల్లో ఆరోగ్యకరమైన వీర్య కణాలు, స్త్రీలలో అండాల లభ్యత తగ్గుతాయి. మూడు పదుల వయసు దాటిన వారిలో సంతాన లేమితో పాటు పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలూ రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారికి స్పెర్మ్ బ్యాంక్‌లు ఆశాకిరణంలాకనిపిస్తున్నాయి. కెరీర్.. స్థిరత్వం కోసం.. పెళ్లనేది ఉన్నత చదువులు, కెరీర్‌కు ఆటంకం కలుగుతుందన్న భావన నేటి యువతలో పెరిగిపోయింది. పెద్దల మాట కాదనలేకో, మంచి సంబంధాలొచ్చాయనో.. ఆలస్యమైతే ఇబ్బందులెదురవుతాయని కెరీర్లో స్థిరపడకపోయినా 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటున్నారు. మరోవైపు పెళ్లయిన కొంతకాలానికి కొందరు మహిళలు ఊబకాయులవుతున్నారు. ఇలాంటి వారిలో సంతాన సాఫల్య అవకాశాలు తక్కువ. వారంతా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిన స్పెర్మ్ బ్యాంక్‌లను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పరిమితమైన స్పెర్మ్ బ్యాంక్‌లు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. ♦ ఐఏఎస్‌కు ప్రిపేరవ్వాలనుకున్న ఓ వివాహిత తనకు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంది. కొన్నాళ్లు ఆగుదామంటే వయసు ముప్పై దాటిపోతుంది. పైగా ఒకింత ఊబకాయం.. అందుకని ఇప్పుడే తన అండాల్ని భద్రపర్చుకుని.. జీవితంలో సెటిలయ్యాక పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది. విజయవాడలోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రికి వెళ్లి స్పెర్మ్ బ్యాంక్ ప్రక్రియపై ఆరా తీసింది. ♦ నామమాత్రపు జీతంతో నెట్టుకొస్తున్న ఓ యువకుడికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ జీతంతో బతుకీడ్చటం కష్టమవుతున్న తరుణంలో పిల్లలు పుడితే ఆర్థికంగా మరింత భారం పెరుగుతుందని భావించాడు. కెరీర్లో ఎదిగి.. ఆర్థికంగా స్థిరపడే వరకు సంతానం వద్దనుకున్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడే తన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంక్‌లో కొన్నేళ్లపాటు దాచుకునే అవకాశం ఉందన్న విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని ఆ బ్యాంక్ నిర్వాహకుల్ని కలిశాడు. బ్యాంక్‌లో ఎలా దాస్తారంటే.. వీర్యకణాలు, అండాలను దాచడానికి కార్పొరేట్ స్థాయి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఆస్పత్రుల్లో సదుపాయాలుంటాయి. ఇలాంటివి విజయవాడలోనూ ఉన్నాయి. స్త్రీ, పురుషుల నుంచి సేకరించిన అండాలు, వీర్య కణాలను మైనస్ 196 డిగ్రీల వద్ద ఫ్రీజ్ చేసి వేర్వేరుగా భద్రపరుస్తారు. దీనివల్ల వాటి ఎదుగుదల ఆగిపోతుంది. అవసరమైనప్పుడు వైద్యులు వీటిని ఇంక్యుబేట్ చేసి అండం ఎదుగుదలకు వీలు కల్పించి గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. మత్తు, ఇంజెక్షన్ల అవసరం లేకుండానే ఈ ప్రక్రియను 15 నిమిషాల్లో పూర్తి చేస్తారు. ఇలా వీర్యాన్ని భద్రపరచినందుకు ఏడాదికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు.. అండానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల చొప్పున కార్పొరేట్ ఆస్పత్రులు అద్దె వసూలు చేస్తున్నాయి. వీర్యం, అండాలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడానికి (ఎంబ్రియో ట్రాన్స్ఫర్) రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుంటారు. భద్రపరచిన వీర్యం, అండాలు తారుమారయ్యే అవకాశాల్లేకుండా ట్యాగింగ్ చేస్తారు. పెళ్లికి ముందు కూడా.. మెట్రో నగరాల్లో కొంతమంది పెళ్లికి ముందే వీటిని స్పెర్మ్ బ్యాంక్‌ల్లో దాచుకుంటున్నారు. వివాహం చేసుకుని విదేశాలకు వెళ్తున్న పురుషులు, ఎన్ఆర్ఐలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంతానం కావాలనుకున్నప్పుడు భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ వైద్యులు వాటిని భార్య గర్భసంచిలోకి ప్రవేశపెట్టి గర్భం దాల్చేలా చేస్తారు. అవగాహన పెరుగుతోంది స్పెర్మ్ బ్యాంక్‌లపై యువతలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. కెరీర్ గురించి ఆలోచించేవారు, జీవితంలో స్థిరపడ్డాకే పిల్లలను కనాలనుకునేవారు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలా భద్రపరచిన వీర్యం, అండాలు ఏళ్ల తరబడి సురక్షితంగా ఉంటాయి. గర్భంలో ప్రవేశపెట్టాక సక్సెస్ రేట్ బాగుంటుంది. ఆడ, మగ వారిలో 30 ఏళ్ల తర్వాత సంతాన సాఫల్య అవకాశాలు ఏటా 5 శాతం చొప్పున తగ్గుతాయి. 40 ఏళ్ల వయసు దాటిన మహిళలకు సంతాన అవకాశం 6 శాతం మాత్రమే ఉంటుంది. ఒవరీస్ ట్యూమర్స్ (క్యాన్సర్) బారినపడ్డ పిన్న వయసు మహిళలకు రేడియో, కీమోథెరపీ చేయడం వల్ల అండాలు చనిపోతాయి. వీరి అండాన్ని చికిత్సకు ముందే భద్రపరచి వ్యాధి తగ్గాక గర్భసంచిలో ప్రవేశపెట్టడం ద్వారా గర్భధారణకు వీలవుతుంది. మారుతున్న కాలానికి ఈ స్పెర్మ్ బ్యాంక్‌లు మేలే చేస్తాయి. –డాక్టర్ కొల్లి రమాదేవి, ఇన్ఫెర్టిలిటీ నిపుణులు, కార్తీక్‌దత్త ఐవీఎఫ్ సెంటర్, విజయవాడ -
కిడ్నీలు అమ్మక్కర్లేదు... డోనర్ కండి
ఆపిల్ ఐఫోన్ 6ఎస్ కోసం ఇద్దరు చైనీయులు తమ కిడ్నీలకు అమ్ముకునేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. పత్రికల్లో ఈ వార్త ప్రచురితమవడంతో చైనాలోని హుబియ్ ప్రావిన్స్‌లోని స్పెర్మ్ బ్యాంకు (ఆరోగ్యవంతుల నుంచి వీర్యకణాలను సేకరించి... గర్భం దాల్చాలకునే మహిళలకు అందించే సంస్థ. రకరకాల కారణాలతో పిల్లలు పుట్టని దంపతులు చివరకు సంతానం కోసం స్పెర్మ్ బ్యాంకును ఆశ్రయిస్తారు. దాత వీర్యంతో గృహిణి అండాన్ని కృత్రిమంగా ఫలదీకరించి గర్భంలో ప్రవేశపెడతారు. దాతల వివరాలు గోప్యంగా ఉంచుతారు) వినూత్న ఆలోచన చేసింది. ‘ఐఫోన్ 6ఎస్‌ను పొందడానికి కొత్తమార్గాలు’ అనే శీర్షికతో ఆన్లైన్ యాడ్ ఇచ్చింది. చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్నెట్వర్క్ ‘వీచాట్’లో ఈ యాడ్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మక్కర్లేదు... వీర్యాన్ని ఇవ్వండి చాలు అని కోరింది. ఒకసారి వీర్యాన్ని ఇస్తే ఆరు వేల యువాన్లు (62,000 రూపాయలు) అందుతాయి... 5,288 యువాన్లకే మీకు ఐఫోన్ 6ఎస్ వస్తుంది. కాబట్టి త్వరపడండి... ఒక కుటుంబానికి సంతోషాలు పంచండి’ అని కోరింది. చైనాలో అవగాహన లేనందువల్ల వీర్యదాతలకు తీవ్ర కొరత ఉందట. అందుకని... స్పెర్మ్ బ్యాంకులు ఆన్లైన్లో దాతల కోసం ప్రకటనలు ఇస్తుంటాయి. ఈ ఆఫరేదో బాగుంది అనుకునేరు. దాతగా ఎంపిక కావాలంటే చాలా చూస్తారు. తెలివితేటలు ఉండాలి, ఒడ్డూపొడుగు ఉండాలి, మంచి కుటుంబనేపథ్యం ఉండాలి... ఇలా చాలా చూస్తారు. ఎందుకంటే ఇలాంటి వారి నుంచి వీర్యం స్వీకరిస్తే తమ పిల్లలు కూడా వారిలాగే ఉంటారని గ్రహీతలు ఆశపడతారు కాబట్టి. -
తెల్లజాతి తల్లికి నల్లజాతి బిడ్డ ...
ఒహియో : ఆసుపత్రుల్లో పిల్లల తారుమారు వార్తలు విన్నాం కానీ ... స్పెర్మ్ (వీర్యం) తారుమారైన సంఘటన ఆమెరికాలోని తెల్లజాతి మహిళలకు ఎదురైంది. అమెరికాలో ఓ మహిళ గర్భం దాల్చడానికి శ్వేతజాతి వ్యక్తి వీర్యాన్ని (స్పెర్మ్)కి బదులు నల్లజాతి వ్యక్తి స్పెర్మ్‌ను ఎక్కించడం వివాదంగా మారింది. ఈ వివాదంపై బాధిత మహిళ ఒహియో నగరానికి చెందిన జెన్నిఫర్ దాఖలు చేసిన దావాను డ్యూపేజ్ కౌంటీ కోర్టు తిరస్కరించింది. 2011 డిసెంబర్లో కృత్రిమ వీర్య దానం ద్వారా గర్భం దాల్చడానికి ఓ శ్వేతజాతి వ్యక్తిని జెన్నీఫర్ ఎంపిక చేసుకున్నది. కానీ ఇల్లినాయిస్ మిడ్వెస్ట్ స్పెర్మ్ బ్యాంకు (వీర్యనిధి) నిర్లక్ష్యం కారణంగా వీర్యదాత 380కి బదులు330 నంబర్ నల్లజాతీయుడి వీర్యాన్ని జెన్నిఫర్ గర్భంలోకి ఎక్కించారు. వీర్యనిధి బ్యాంక్ సిబ్బంది చేసిన పొరపాటుకు ఫలితం తెల్ల జాతీయురాలైన జెన్నిఫర్‌కి నల్లజాతి లక్షణాలున్న చిన్నారికి జన్మనివ్వాల్సి వచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత అసలు విషయం బయటపడింది. స్పెర్మ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరో తెగకు చెందిన చిన్నారికి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె కోర్టును ఆశ్రయించింది. వైద్య ప్రమాణాల ప్రకారం పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని... ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు న్యాయశాస్త్ర పరిధిలోకి రాదని డ్యూపెజ్ కోర్టు తన తీర్పులో పేర్కొంది.