సాక్షి, అమరావతి బ్యూరో: చేతినిండా సొమ్మున్నప్పుడు బ్యాంక్‌లో దాచుకుని అవసరమైనప్పుడు వాడుకుంటాం. అదేవిధంగా యుక్త వయసులో ఉండే వీర్యకణాలు, అండాలనూ బ్యాంక్‌లో డిపాజిట్ చేసి.. కావాలనుకున్నప్పుడు విత్ డ్రా చేసుకుని పిల్లల్ని కనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆశ్చర్యం అనిపిస్తున్నా.. ఇది ముమ్మాటికీ నిజం. ‘స్పెర్మ్ బ్యాంక్’లుగా పిలిచే ఈ నూతన సాంకేతిక పద్ధతులపై యువ దంపతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు మన చెంతకూ వచ్చింది. సహజంగా 30 ఏళ్లు దాటాక పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తి అవకాశాలు సన్నగిల్లుతాయి. వయసు పెరిగేకొద్దీ పురుషుల్లో ఆరోగ్యకరమైన వీర్య కణాలు, స్త్రీలలో అండాల లభ్యత తగ్గుతాయి. మూడు పదుల వయసు దాటిన వారిలో సంతాన లేమితో పాటు పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలూ రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారికి స్పెర్మ్ బ్యాంక్‌లు ఆశాకిరణంలాకనిపిస్తున్నాయి.
కెరీర్.. స్థిరత్వం కోసం..
పెళ్లనేది ఉన్నత చదువులు, కెరీర్‌కు ఆటంకం కలుగుతుందన్న భావన నేటి యువతలో పెరిగిపోయింది. పెద్దల మాట కాదనలేకో, మంచి సంబంధాలొచ్చాయనో.. ఆలస్యమైతే ఇబ్బందులెదురవుతాయని కెరీర్‌లో స్థిరపడకపోయినా 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటున్నారు. మరోవైపు పెళ్లయిన కొంతకాలానికి కొందరు మహిళలు ఊబకాయులవుతున్నారు. ఇలాంటి వారిలో సంతాన సాఫల్య అవకాశాలు తక్కువ. వారంతా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిన స్పెర్మ్ బ్యాంక్‌లను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పరిమితమైన స్పెర్మ్ బ్యాంక్‌లు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి.
♦ ఐఏఎస్‌కు ప్రిపేరవ్వాలనుకున్న ఓ వివాహిత తనకు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంది. కొన్నాళ్లు ఆగుదామంటే వయసు ముప్పై దాటిపోతుంది. పైగా ఒకింత ఊబకాయం.. అందుకని ఇప్పుడే తన అండాల్ని భద్రపర్చుకుని.. జీవితంలో సెటిలయ్యాక పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది. విజయవాడలోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రికి వెళ్లి స్పెర్మ్ బ్యాంక్ ప్రక్రియపై ఆరా తీసింది.
♦ నామమాత్రపు జీతంతో నెట్టుకొస్తున్న ఓ యువకుడికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ జీతంతో బతుకీడ్చటం కష్టమవుతున్న తరుణంలో పిల్లలు పుడితే ఆర్థికంగా మరింత భారం పెరుగుతుందని భావించాడు. కెరీర్‌లో ఎదిగి.. ఆర్థికంగా స్థిరపడే వరకు సంతానం వద్దనుకున్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడే తన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంక్‌లో కొన్నేళ్లపాటు దాచుకునే అవకాశం ఉందన్న విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని ఆ బ్యాంక్ నిర్వాహకుల్ని కలిశాడు.
బ్యాంక్‌లో ఎలా దాస్తారంటే..
వీర్యకణాలు, అండాలను దాచడానికి కార్పొరేట్ స్థాయి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఆస్పత్రుల్లో సదుపాయాలుంటాయి. ఇలాంటివి విజయవాడలోనూ ఉన్నాయి. స్త్రీ, పురుషుల నుంచి సేకరించిన అండాలు, వీర్య కణాలను మైనస్ 196 డిగ్రీల వద్ద ఫ్రీజ్ చేసి వేర్వేరుగా భద్రపరుస్తారు. దీనివల్ల వాటి ఎదుగుదల ఆగిపోతుంది. అవసరమైనప్పుడు వైద్యులు వీటిని ఇంక్యుబేట్ చేసి అండం ఎదుగుదలకు వీలు కల్పించి గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. మత్తు, ఇంజెక్షన్ల అవసరం లేకుండానే ఈ ప్రక్రియను 15 నిమిషాల్లో పూర్తి చేస్తారు. ఇలా వీర్యాన్ని భద్రపరచినందుకు ఏడాదికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు.. అండానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల చొప్పున కార్పొరేట్ ఆస్పత్రులు అద్దె వసూలు చేస్తున్నాయి. వీర్యం, అండాలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడానికి (ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్) రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుంటారు. భద్రపరచిన వీర్యం, అండాలు తారుమారయ్యే అవకాశాల్లేకుండా ట్యాగింగ్ చేస్తారు.
పెళ్లికి ముందు కూడా..
మెట్రో నగరాల్లో కొంతమంది పెళ్లికి ముందే వీటిని స్పెర్మ్ బ్యాంక్‌ల్లో దాచుకుంటున్నారు. వివాహం చేసుకుని విదేశాలకు వెళ్తున్న పురుషులు, ఎన్‌ఆర్‌ఐలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంతానం కావాలనుకున్నప్పుడు భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ వైద్యులు వాటిని భార్య గర్భసంచిలోకి ప్రవేశపెట్టి గర్భం దాల్చేలా చేస్తారు.
అవగాహన పెరుగుతోంది
స్పెర్మ్ బ్యాంక్‌లపై యువతలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. కెరీర్ గురించి ఆలోచించేవారు, జీవితంలో స్థిరపడ్డాకే పిల్లలను కనాలనుకునేవారు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలా భద్రపరచిన వీర్యం, అండాలు ఏళ్ల తరబడి సురక్షితంగా ఉంటాయి. గర్భంలో ప్రవేశపెట్టాక సక్సెస్ రేట్ బాగుంటుంది. ఆడ, మగ వారిలో 30 ఏళ్ల తర్వాత సంతాన సాఫల్య అవకాశాలు ఏటా 5 శాతం చొప్పున తగ్గుతాయి. 40 ఏళ్ల వయసు దాటిన మహిళలకు సంతాన అవకాశం 6 శాతం మాత్రమే ఉంటుంది. ఒవరీస్ ట్యూమర్స్ (క్యాన్సర్) బారినపడ్డ పిన్న వయసు మహిళలకు రేడియో, కీమోథెరపీ చేయడం వల్ల అండాలు చనిపోతాయి. వీరి అండాన్ని చికిత్సకు ముందే భద్రపరచి వ్యాధి తగ్గాక గర్భసంచిలో ప్రవేశపెట్టడం ద్వారా గర్భధారణకు వీలవుతుంది. మారుతున్న కాలానికి ఈ స్పెర్మ్ బ్యాంక్‌లు మేలే చేస్తాయి. –డాక్టర్ కొల్లి రమాదేవి,
ఇన్‌ఫెర్టిలిటీ నిపుణులు, కార్తీక్‌దత్త ఐవీఎఫ్ సెంటర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment