గులాబీ రంగు పురుగుతో జాగ్రత్త
పోచమ్మమైదాన్ : జిల్లాలో సాగుచేసిన పత్తి పంటలో గులాబీ రంగు పురుగు తక్కువ మోతాదులోనే ఉంది.. రైతులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా గమనిస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ డాక్టర్ పి.రఘురామిరెడ్డి అన్నారు. శాస్త్రవేత్తలు శుక్రవారం జనగామ, లింగాలఘన్పూర్, రఘునాథపల్లి, పరకాల, హన్మకొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించి పత్తి పంటలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పూత, కాయ పెరుగుదల దశలో ఉందన్నారు. సాధరణంగా గులాబీ రంగు పురుగు ఆశించిన పూలు గడ్డిపూలుగా మారతాయి. ఈ సారి మాములుగా ఉన్న పూలలో గులాబీ రంగు పురుగు ఆశించినట్లు గుర్తించామని చెప్పారు. నివారణకు పంటలో లింగాకర్షక బట్టలు అమర్చుకుని ఉధృతిని గమనించాలని సూచించారు. వరుసగా 3 రోజుల పాటు బుట్టకు 8 కంటే ఎక్కువ తల్లి పురుగులు పడితే థయోడైకార్బ్ 1.5 గ్రాములు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఉమారెడ్డి, పత్తి శాస్త్రవేత్త రాంప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.