అమెరికాలో పెరిగిన విద్వేష నేరాలు
న్యూయార్క్: అమెరికాలో విద్వేష గ్రూపుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. 2015 సంవత్సరంలో అమెరికాలో 892 విద్వేశ గ్రూపులు ఉండగా, వాటి సంఖ్య 2016 నాటికి 917కు చేరుకుందని సదరన్ పావర్టీ లా సెంటర్ (ఎస్పీఎల్సీ) పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. ఇక 1999 సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ విద్వేష గ్రూపుల సంఖ్య దాదాపు రెట్టింపు పెరిగాయి. ఈ గ్రుపుల్లో ఎక్కువగా ముస్లిం వ్యతిరేక, విదేశాల నుంచి వలసల వ్యతిరేక, ఎల్జీబీటీ వ్యతిరేక, శ్వేత జాతీయవాద, నయా నాజిజం, నయా కానిఫడరేట్, నల్లజాతీయుల వేర్పాటువాద గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి.
గతంతో పోలిస్తే కూ, క్లక్స్, క్లా (క్లాన్), ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, వివిధ రాజకీయ గ్రూపుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ముస్లిం వ్యతిరేక గ్రూపుల సంఖ్య మునుపెన్ననడు లేనివిధంగా పెరిగింది. గతంతో 37 ముస్లిం వ్యతిరేక గ్రూపులు ఉండగా, వాటి సంఖ్య 101కి చేరుకుంది. ఒక్క ఏడాది కాలంలోనే వీటి సంఖ్య 197 శాతం పెరగడం గమనార్హం. 2014 సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడుల సంఖ్య ఏకంగా 67 శాతం పెరిగిందని ఎఫ్బీఐ లెక్కలు తెలియజేస్తున్నాయి.
ముస్లింలలో సంయమనం చాలా తక్కువని, హింస ఎక్కువని, హేతువాదులు కాదని, పిల్లల పట్ల లైంగిక వాంఛ ఎక్కువని, స్వలింగ సంపర్కులనే అభిప్రాయాలు ఎక్కువగా ఉండడం వల్లనే వారిని ద్వేషించే గ్రూపులు పెరుగుతున్నాయని ఎస్పీఎల్సీ పేర్కొంది. మన్హట్టన్లో ఇస్లామిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం, 2010లో ముస్లింలకు వ్యతిరేకమైన చట్టం తీసుకరావడం కూడా ఈ గ్రూపులు పెరగడానికి కారణమైంది.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక అమెరికాలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే 1372 విద్వేష నేరాలు జరిగాయి. వాటిలో 25 శాతం విదేశీయుల వలసలకు వ్యతిరేకంగానే జరిగాయి. వాటిలో ఆఫ్రికన్ అమెరికన్లకు వ్యతిరేకంగా తొమ్మిది శాతం, ఎల్జీబీటీకి వ్యతిరేకంగా పది శాతం, ముస్లింలు లక్ష్యంగా తొమ్మిది శాతం దాడులు జరిగాయి.