SPMCIL
-
భాగ్యనగరంలో మింట్ మ్యూజియం..దేశంలోనే తొలిసారిగా..!
సాక్షి, హైదరాబాద్: నాణేలు ఎలా తయారవుతాయి.. నోట్ల ముద్రణ ఎలా జరుగుతుంది.. ఆ యంత్రాలెలా ఉంటాయి.. ఈ విషయాలు అందరికీ ఆసక్తికరమే. మరి నోట్ల ముద్రణను స్వయంగా చూడగలిగితే.. బాగుంటుంది కదా.. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ అవకాశం కలగనుంది. మన దేశంలో ప్రస్తుతం నోట్లు, నాణేలు ముద్రించే కీలక మింట్లలో ఒకటి చర్లపల్లిలో ఉన్న హైదరాబాద్ మింట్. దానికన్నా ముందు నిజాం హయాంలోనే హైదరాబాద్‌లో నోట్లు ముద్రించిన మింట్ సైఫాబాద్‌లో నేటికీ పదిలంగా నిలిచి ఉంది. వందేళ్ల కంటే పూర్వం నాటి యంత్రాలతో కూడిన ఆ భవనంలోనే ‘మింట్ మ్యూజియం’ ఏర్పాటు కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)’ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆజాదీ కా అమృతోత్సవ్’లో భాగంగా వచ్చేనెల రెండో వారంలో సైఫాబాద్ మింట్ భవనంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చే పని ప్రారంభం కానుంది. ఇక్కడి పురాతన యంత్రాలను పునరుద్ధరించే కసరత్తు మొదలుపెట్టారు. తొలుత ఎగ్జిబిషన్ కోసం ‘ఇంటాక్’ హైదరాబాద్ చాప్టర్ సహకారంతో పనులు మొదలయ్యాయి. వందేళ్లకు పైబడి కరెన్సీని ముద్రించిన మింట్‌ను మ్యూజియంగా మార్చుతుండటం దేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిజాం హయాంలో.. స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజులు సొంతంగా నాణాలు ముద్రించుకోవడం కోసం మింట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూడో నిజాం నవాబ్ సికిందర్జా 1803లో రాయల్ మింట్‌కు ఆర్డర్ ఇచ్చాడు. సుల్తాన్‌షాహీలో ఉన్న రాయల్ ప్యాలెస్‌లో ఏర్పాటైన ఆ మింట్‌లో.. నిజాం సంస్థానం సొంత నాణేలు తయారయ్యేవి. వాటిని చేతితో రూపొందించేవారు. 1857 తొలి స్వాతంత్య్ర పోరాటం తర్వాత దేశంలోని కొన్ని ముఖ్యమైన మింట్లు మినహా మిగతావాటిని బ్రిటిష్ ప్రభుత్వం మూసేసింది. ముంబై, కోల్‌కతాల్లో రెండు ఆధునిక మింట్లను ఏర్పాటు చేసింది. వాటిలో పూర్తిగా యంత్రాలతో నాణేలు, నోట్లు ముద్రించేవారు. ఆరో నిజాం తమ మింట్‌లో కూడా యంత్రాలతో ముద్రణ జరగాలని భావించి.. 1895లో లండన్ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. వాటితో చర్కి (చర్కా) నాణేల ముద్రణ మొదలైంది. పూర్తిస్థాయిలో ఆధునీకరించే ఉద్దేశంతో సైఫాబాద్‌లో ప్రత్యేక భవనాన్ని నిర్మించి 1903లో యూరప్ మింట్ల తరహాలో పూర్తి ఆధునిక పద్ధతుల్లో నాణేలు ముద్రించే కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 1918లో హైదరాబాద్ కరెన్సీ చట్టాన్ని తెచ్చి.. నోట్ల ముద్రణ కూడా ప్రారంభించారు. నాణేలతోపాటు రూ.1,000, రూ.100, రూ.10, రూ.5 పేపర్ కరెన్సీని, స్టాంపు పేపర్లను కూడా ముద్రించారు. తర్వాత మెడల్స్, బ్యాడ్జెస్, ఇతర జ్ఞాపికలు కూడా రూపొందించేవారు. -
త్వరలో రూ.20 నాణాలు
డబ్బులు చెట్లకు కాస్తాయా అని ఓ సామెత ఉంది... కానీ డబ్బులు ఇదిగో ఇక్కడ చెప్పుకునే టంకసాల నుంచే ఆవిర్భవిస్తాయి. నేడు(ఫిబ్రవరి 10) ‘భారత సురక్షిత ప్రచురణ-టంకసాల కార్పొరేషన్ లిమిటెడ్’(SPMCIL) ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా దాని విశేషాలు తెలుసుకుందాం.. పుట్టుక: భారత ప్రభుత్వ టంకసాల హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉంది. మూడో నిజాం నవాబ్ సికిందర్ యా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 1803లో హైదరాబాద్‌లోని సుల్తాన్షాహి రాజసౌధంలో టంకసాల ఏర్పాటైంది. అయితే 1857లో తొలి స్వాతంత్ర్య పోరాటం అనంతరం హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థానాల్లో మినహా భారతదేశంలోని అన్ని టంకసాలలూ రద్దయ్యాయి. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు బాంబే, కలకత్తా నగరాల్లో తమ సొంత ప్రభుత్వ టంకసాలలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ టంకసాలలు యంత్రాలతో నాణాలను ముద్రిస్తుండగా, దేశంలోని ఇతర రాచరిక టంకసాలలు చేతి తయారీ నాణాలను విడుదల చేస్తుండేవి. ఈ నేపథ్యంలో 1893లో హైదరాబాద్‌లోని రాచరిక టంకసాలను సుల్తాన్ షాహి రాజసౌధం నుంచి దానికోసమే ప్రత్యేకంగా కేటాయించిన ‘దార్-ఉస్-షఫా’ సౌధంలోకి తరలించారు. అప్పటికి ఇక్కడ చేతితోనే నాణాలను తయారు చేస్తుండేవారు. ఇదంతా ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలన కాలం నాటి సంగతి. అనంతరం ఈ ఆధునిక టంకసాలల వ్యవస్థాపక పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఆయన తోడ్పాటుతో ఈ టంకసాల అభివృద్ధి చెందింది. ‘చర్ఖీ’లుగా చలామణీ అయిన నాణాలు హైదరాబాద్ సంస్థానంలోని టంకసాలకు 1895లో తొలియంత్ర సదుపాయం సమకూరింది. దీనిపై మొట్టమొదట ముద్రించిన నాణాలను ‘చర్ఖీ’(చక్రపు యంత్రంపై రూపొందినవి)గా వ్యవహరించేవారు. ఆ తర్వాత టంకసాల సైఫాబాద్ ప్రాంతానికి తరలిపోగా, 1903 జూలై 13 నుంచి అక్కడ ఆధునిక యంత్రాలతో నాణాల ముద్రణ ప్రారంభమైంది. 1950లో సమాఖ్య ద్రవ్య ఏకీకరణ కింద ఇక్కడి టంకసాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తన ఆధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ ముద్రణ కొనసాగింపులో భాగంగా 1950 దశకం మధ్యవరకు ఇక్కడ నిజాం పేరిట నాణాల ముద్రణ కొనసాగింది. చివరకు విజయవంతమైన ప్రభుత్వరంగ సంస్థల నమూనాకు నిదర్శనంగా నిలిచిన మినీరత్న సంస్థ ‘భారత సురక్షిత ప్రచురణ-టంకసాల కార్పొరేషన్ లిమిటెడ్’(SPMCIL)లో 2006 ఫిబ్రవరి 10న హైదరాబాద్ టంకసాల విలీనమైంది. నాణాల ముద్రణ సామర్థ్యాన్ని పెంచాల్సిన దృష్ట్యా మరోసారి (రూ.130 కోట్ల వ్యయంతో) టంకసాల తరలింపు అవసరమైంది. కాగా, 1985 నుంచి 2000 సంవత్సరం వరకు భారత నాణాల ముద్రణ బాధ్యతను 10 విదేశీ టంకసాలలను అప్పగించేవారు. వీటిలో 3 యునైటెడ్ కింగ్డమ్, 2 దక్షిణ కొరియా టంకసాలలు కాగా మిగిలినవి కెనడా, మెక్సికో, స్లొవేకియా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలకు చెందినవి. అయితే ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో నేడు మన దేశం నాణాల దిగుమతికి స్వస్తి చెప్పింది. అంతే కాదు.. హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ టంకసాల(IGMH) నుంచి అత్యాధునిక భద్రత లక్షణాలతో ముద్రించిన నాణాలను ఎగుమతి చేస్తోంది. వెబ్సైట్ ద్వారా కొనుగోలు నాణాల ఎగుమతి మాత్రమే కాక తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ సాయి సంస్థాన్ ట్రస్ట్, హులిగమ్మ ఆలయం, శ్రీకాళహస్తి దేవస్థానం వంటి దేశంలోగల వివిధ ఆలయాల నుంచి వచ్చే బంగారు, వెండిని కరిగించి శుద్ధి చేసి బ్రిటీష్ ప్రమాణాల(బీఎస్)కు అనుగుణంగా కొత్తరూపం ఇచ్చే పనిలో హైదరాబాద్ టంకసాల నిమగ్నమైంది. అలాగే ఎగుమతి-దిగుమతి సుంకాల విభాగం స్వాధీనం చేసుకునే బంగారాన్ని కడ్డీలుగా మార్చడంలో సహకరిస్తోంది. దీంతోపాటు నాణాల సేకరణ అభిరుచి గల వారికోసం స్మారక నాణాలను తయారు చేస్తోంది. వీటిని సైఫాబాద్‌లోని టంకసాల అమ్మకపు విభాగంలో, spmcil వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నాణ్యత, స్వచ్ఛతలలో విలువైన లోహ ఉత్పత్తుల తయారీలో IGMHకు తిరుగులేని విశ్వసనీయత ఉంది. ప్రస్తుతం దృష్టిలోపం గల వారికోసం 2019 పరంపరలో అత్యాధునిక నాణాలను IGMH ముద్రిస్తోంది. అలాగే త్వరలో రూ.20 నాణాలను కూడా విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో జాతికి మరింత విస్తృత సేవలు, ఉత్పత్తులను అందించేందుకు IGMH పునరంకితమవుతోంది. -
మార్కెట్లో నోట్లకు కొరత లేదు: జైట్లీ
కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరాయని వెల్లడి న్యూఢిల్లీ: వ్యవస్థలో ఉన్న కరెన్సీలో పెద్ద నోట్ల రద్దు రూపేణా 86 శాతాన్ని వెనక్కి తీసేసుకున్న తర్వాత వారాల వ్యవధిలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్పినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కొత్త నోట్లను వ్యవస్థలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆర్బీఐ కరెన్సీ ముద్రణా కేంద్రాలు, సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్) విరామం లేకుండా పనిచేశాయన్నారు. ఎస్పీఎంసీఐఎల్ 11వ వ్యస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు. డీమోనిటైజేషన్ సమయంలో తేలికైన పనల్లా వ్యాఖ్యలు, నిందలు వేయడమేనని విమర్శించిన వారిని ఉద్దేశించి అన్నారు. కానీ, దీని అమలు ఎంతో కష్టమైన పనిగా చెప్పారు. అవినీతి మూలాలను, నల్లధనం, నకిలీ కరెన్సీని ఏరిపారేసే లక్ష్యంతో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద డీమోనిటైజేషన్ కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఏడాది పడుతుందని, ఏడు నెలలైనా పడుతుందంటూ పలువురు వ్యాఖ్యానించారని, ఆ పనిని కొన్ని వారాల్లోనే పూర్తి చేసినట్టు చెప్పారు. ఎక్కడా ఏ ఒక్క అశాంతి ఘటనకు తావు లేకుండా దీన్ని సాధించినట్టు తెలిపారు. ముద్రణా కేంద్రాలు, మింట్ల అవిశ్రాంత కృషివల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ కూడా పాల్గొన్నారు.