డబ్బులు చెట్లకు కాస్తాయా అని ఓ సామెత ఉంది... కానీ డబ్బులు ఇదిగో ఇక్కడ చెప్పుకునే టంకసాల నుంచే ఆవిర్భవిస్తాయి. నేడు(ఫిబ్రవరి 10) ‘భారత సురక్షిత ప్రచురణ-టంకసాల కార్పొరేషన్ లిమిటెడ్’(SPMCIL) ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా దాని విశేషాలు తెలుసుకుందాం..
పుట్టుక: భారత ప్రభుత్వ టంకసాల హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉంది. మూడో నిజాం నవాబ్ సికిందర్ యా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 1803లో హైదరాబాద్‌లోని సుల్తాన్‌షాహి రాజసౌధంలో టంకసాల ఏర్పాటైంది. అయితే 1857లో తొలి స్వాతంత్ర్య పోరాటం అనంతరం హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థానాల్లో మినహా భారతదేశంలోని అన్ని టంకసాలలూ రద్దయ్యాయి. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు బాంబే, కలకత్తా నగరాల్లో తమ సొంత ప్రభుత్వ టంకసాలలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ టంకసాలలు యంత్రాలతో నాణాలను ముద్రిస్తుండగా, దేశంలోని ఇతర రాచరిక టంకసాలలు చేతి తయారీ నాణాలను విడుదల చేస్తుండేవి. ఈ నేపథ్యంలో 1893లో హైదరాబాద్‌లోని రాచరిక టంకసాలను సుల్తాన్ షాహి రాజసౌధం నుంచి దానికోసమే ప్రత్యేకంగా కేటాయించిన ‘దార్-ఉస్-షఫా’ సౌధంలోకి తరలించారు. అప్పటికి ఇక్కడ చేతితోనే నాణాలను తయారు చేస్తుండేవారు. ఇదంతా ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలన కాలం నాటి సంగతి. అనంతరం ఈ ఆధునిక టంకసాలల వ్యవస్థాపక పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఆయన తోడ్పాటుతో ఈ టంకసాల అభివృద్ధి చెందింది.
‘చర్ఖీ’లుగా చలామణీ అయిన నాణాలు
హైదరాబాద్ సంస్థానంలోని టంకసాలకు 1895లో తొలియంత్ర సదుపాయం సమకూరింది. దీనిపై మొట్టమొదట ముద్రించిన నాణాలను ‘చర్ఖీ’(చక్రపు యంత్రంపై రూపొందినవి)గా వ్యవహరించేవారు. ఆ తర్వాత టంకసాల సైఫాబాద్ ప్రాంతానికి తరలిపోగా, 1903 జూలై 13 నుంచి అక్కడ ఆధునిక యంత్రాలతో నాణాల ముద్రణ ప్రారంభమైంది. 1950లో సమాఖ్య ద్రవ్య ఏకీకరణ కింద ఇక్కడి టంకసాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తన ఆధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ ముద్రణ కొనసాగింపులో భాగంగా 1950 దశకం మధ్యవరకు ఇక్కడ నిజాం పేరిట నాణాల ముద్రణ కొనసాగింది. చివరకు విజయవంతమైన ప్రభుత్వరంగ సంస్థల నమూనాకు నిదర్శనంగా నిలిచిన మినీరత్న సంస్థ ‘భారత సురక్షిత ప్రచురణ-టంకసాల కార్పొరేషన్ లిమిటెడ్’(SPMCIL)లో 2006 ఫిబ్రవరి 10న హైదరాబాద్ టంకసాల విలీనమైంది.
నాణాల ముద్రణ సామర్థ్యాన్ని పెంచాల్సిన దృష్ట్యా మరోసారి (రూ.130 కోట్ల వ్యయంతో) టంకసాల తరలింపు అవసరమైంది. కాగా, 1985 నుంచి 2000 సంవత్సరం వరకు భారత నాణాల ముద్రణ బాధ్యతను 10 విదేశీ టంకసాలలను అప్పగించేవారు. వీటిలో 3 యునైటెడ్ కింగ్‌డమ్, 2 దక్షిణ కొరియా టంకసాలలు కాగా మిగిలినవి కెనడా, మెక్సికో, స్లొవేకియా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలకు చెందినవి. అయితే ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో నేడు మన దేశం నాణాల దిగుమతికి స్వస్తి చెప్పింది. అంతే కాదు.. హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ టంకసాల(IGMH) నుంచి అత్యాధునిక భద్రత లక్షణాలతో ముద్రించిన నాణాలను ఎగుమతి చేస్తోంది.
వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు
నాణాల ఎగుమతి మాత్రమే కాక తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ సాయి సంస్థాన్ ట్రస్ట్, హులిగమ్మ ఆలయం, శ్రీకాళహస్తి దేవస్థానం వంటి దేశంలోగల వివిధ ఆలయాల నుంచి వచ్చే బంగారు, వెండిని కరిగించి శుద్ధి చేసి బ్రిటీష్ ప్రమాణాల(బీఎస్)కు అనుగుణంగా కొత్తరూపం ఇచ్చే పనిలో హైదరాబాద్ టంకసాల నిమగ్నమైంది. అలాగే ఎగుమతి-దిగుమతి సుంకాల విభాగం స్వాధీనం చేసుకునే బంగారాన్ని కడ్డీలుగా మార్చడంలో సహకరిస్తోంది. దీంతోపాటు నాణాల సేకరణ అభిరుచి గల వారికోసం స్మారక నాణాలను తయారు చేస్తోంది. వీటిని సైఫాబాద్‌లోని టంకసాల అమ్మకపు విభాగంలో, spmcil వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నాణ్యత, స్వచ్ఛతలలో విలువైన లోహ ఉత్పత్తుల తయారీలో IGMHకు తిరుగులేని విశ్వసనీయత ఉంది. ప్రస్తుతం దృష్టిలోపం గల వారికోసం 2019 పరంపరలో అత్యాధునిక నాణాలను IGMH ముద్రిస్తోంది. అలాగే త్వరలో రూ.20 నాణాలను కూడా విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో జాతికి మరింత విస్తృత సేవలు, ఉత్పత్తులను అందించేందుకు IGMH పునరంకితమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment