మార్కెట్లో నోట్లకు కొరత లేదు: జైట్లీ
కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరాయని వెల్లడి
న్యూఢిల్లీ: వ్యవస్థలో ఉన్న కరెన్సీలో పెద్ద నోట్ల రద్దు రూపేణా 86 శాతాన్ని వెనక్కి తీసేసుకున్న తర్వాత వారాల వ్యవధిలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్పినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కొత్త నోట్లను వ్యవస్థలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆర్‌బీఐ కరెన్సీ ముద్రణా కేంద్రాలు, సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్) విరామం లేకుండా పనిచేశాయన్నారు. ఎస్‌పీఎంసీఐఎల్ 11వ వ్యస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు. డీమోనిటైజేషన్ సమయంలో తేలికైన పనల్లా వ్యాఖ్యలు, నిందలు వేయడమేనని విమర్శించిన వారిని ఉద్దేశించి అన్నారు.
కానీ, దీని అమలు ఎంతో కష్టమైన పనిగా చెప్పారు. అవినీతి మూలాలను, నల్లధనం, నకిలీ కరెన్సీని ఏరిపారేసే లక్ష్యంతో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద డీమోనిటైజేషన్ కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఏడాది పడుతుందని, ఏడు నెలలైనా పడుతుందంటూ పలువురు వ్యాఖ్యానించారని, ఆ పనిని కొన్ని వారాల్లోనే పూర్తి చేసినట్టు చెప్పారు. ఎక్కడా ఏ ఒక్క అశాంతి ఘటనకు తావు లేకుండా దీన్ని సాధించినట్టు తెలిపారు. ముద్రణా కేంద్రాలు, మింట్‌ల అవిశ్రాంత కృషివల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ కూడా పాల్గొన్నారు.