ఉత్సాహంగా జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్ :
వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న జిల్లాస్థాయి క్రీడా ఎంపికలుసోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ ఎంపికలకు జిల్లాలోని 23 మండలాల నుంచి 59 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 42 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. తొలుత విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన పిమ్మట పదిమంది చొప్పున బృందాలుగా ఏర్పాటుచేసి క్రీడాఎంపికలను నిర్వహించారు. క్రీడాకారుల ఎత్తు, బరువుతో పాటు వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, మెడిసినల్‌బాల్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 6 ఇంటూ 10 మీటర్ల పరుగుపందెం, 800 మీటర్ల పరుగుపందెం తదితర అంశాల్లో ఎంపికల ప్రక్రియ చేపట్టారు.
ఈ సందర్భంగా డీఎస్డీఓ ఎం.ఎస్.ఎల్.ఎన్. శర్మ మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీల్లో రెండురోజుల పాటు ఎంపికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోనే క్రీడాపాఠశాల ఉన్నందున పెద్దసంఖ్యలో విద్యార్థులు ఎంపికలకు వస్తారని విస్తున్నామన్నారు. శాప్ డైరెక్టర్ డి.జయచంద్ర మాట్లాడుతూ జిల్లాలో క్రీడాపాఠశాల ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తగిన ప్రచారం లేకపోవడంతో ఆశించిన మేర క్రీడాకారులు రాలేదన్నారు. ప్రతి యేడాది క్రీడాఎంపికల క్యాలండర్ ప్రకటించి జూన్‌లోనే ఎంపికల ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ తోటకృష్ణ మాట్లాడుతూ క్రీడాపాఠశాలలో సీటు సాధిస్తే క్రీడల్లో రాణించేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు గౌస్‌బాషా, సుదర్శన్, షఫీ, డీఎస్ఏ సిబ్బంది అక్బర్, బాలనాగయ్య రాజు, బాషా, క్రీడాకారులు పాల్గొన్నారు.