Sports Medicine
-
చలికాలంలో పాదాల జాగ్రత్తలు...
చలికాలం వచ్చిందంటే మా పాదాలు పగులుతున్నాయి. ఈ సీజన్లో పాదాల ఆరోగ్యం గురించి మాకు తగిన సలహా ఇవ్వండి. - సుమతి, పలాస చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి. ఇవి చేయకూడదు : చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు. పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు. ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోకూడదు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
కాఫీ, టీ... ఈ రెండింటిలో ఏది మంచిది?
కాఫీ ఎక్కువగా తాగడం అన్నది రన్నర్స్‌కు బాగా మేలు చేస్తుందా? కాఫీ వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందా? అసలు కాఫీ, టీ లలో ఏది మంచిది? - వేణుగోపాల్, గన్నవరం మీరు చెప్పిన సమాచారంలో కొంతవరకే నిజం ఉంది. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల కొంత కొవ్వు కరిగే మాట వాస్తవమే. అయితే విషయం పూర్తిగా తెలియని కొంతమంది రన్నర్లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువగా కాఫీని తాగేస్తుంటారు. కానీ ఇలా ఎక్కువగా కాఫీ తాగటం వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల గుండె స్పందనల్లో, లయలో తేడాలు రావచ్చు. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు అలసిపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీని ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకోవడం సరికాదు. కాఫీ, టీ... ఈ రెండు పానీయాల్లో కాఫీ కన్నా టీ తాగడం కొంతవరకు మంచిదని చెప్పాలి. ఎందుకంటే టీలో ఉండే థయనిన్ అనే అమైనోయాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్) ఉండటం కారణంగా అది చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే చక్కెర, పాల శాతాన్ని తగ్గిస్తేనే మంచిదని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికీ ఉండే వ్యక్తిగతమైన ఇష్టాల కారణంగా మీరు తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే దానిని రోజుకు 2-3 చిన్న కప్పులకు మాత్రమే పరిమితం చేయండి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్ & ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్