Spotted deer
-
చుక్కల దుప్పిని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
పెద్దదోర్నాల: రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని అతివేగంతో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దుప్పి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎకో టూరిజం సమీపంలో తెట్టగుండం వద్ద ఆదివారం జరిగింది. పెద్దదోర్నాల రేంజి అధికారి విశ్వేశ్వరరావు కథనం మేరకు శ్రీశైలం నుంచి సింథనూర్ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు తెట్టగుండం వద్దకు చేరుకునేసరికి ఆ ప్రాంతంలో ఉన్న చుక్కల దుప్పి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. వేగంగా వస్తున్న బస్సు దుప్పిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న స్వచ్ఛ సేవక్‌లు వెంటనే మండల కేంద్రంలో ఉన్న గణపతి చెక్‌పోస్టుకు సమాచారమందించడంతో అధికారులు చెక్‌పోస్టు వద్ద బస్సును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతిచెందిన చుక్కల దుప్పికి అటవీశాఖకు చెందిన పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. -
వనం వదిలి.. చిక్కుల్లో పడి..
కోనేరుసెంటర్ (మచిలీపట్నం)/నందిగామ: దారి తప్పిన దుప్పులు వనం వదిలి జనారణ్యంలోకొచ్చాయి. కాసేపు గంతులేశాయి. చివరికి చిక్కుల్లో పడ్డాయి. వాటిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని క్షేమంగా అడవిలో వదిలేందుకు చర్యలు చేపట్టారు. బందరు మండలం కోన, నందిగామ మండలం పల్లగిరి వద్ద గురువారం ఈ ఘటనలు జరిగాయి. అటవీ అధికారుల కథనం ప్రకారం.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగానీ బందరు మండలం కోన గ్రామంలో ఉన్నట్టుండి దుప్పి ప్రత్యక్షమైంది. కాసేపు గెంతుతూ సందడి చేసింది. గ్రామస్తులు దానిని వెంబడించి పట్టుకుని తాళ్లతో బంధించారు. విషయం తెలుసుకున్న సచివాలయం సిబ్బంది బందరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుప్పిని పరిశీలించిన ఎస్ఐ దాసు అటవీశాఖ అధికారులకు విషయం తెలిపారు. అధికారులొచ్చి దుప్పిని విజయవాడ తీసుకెళ్లారు. కొంచెం అనారోగ్యంగా ఉందని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కొండపల్లి అటవీ ప్రాంతంలో వదులుతామని వారు తెలిపారు. అలాగే, నందిగామ మండలం పల్లగిరి సమీపంలో మరో దుప్పి ప్రత్యక్షమైంది. వీధి కుక్కల దాడిలో స్వల్పంగా గాయపడింది. గ్రామస్తులు దుప్పిని రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి దుప్పికి చికిత్స చేయించారు. అనంతరం దానిని కొండపల్లి రిజర్వు ఫారెస్టులో విడిచిపెట్టినట్టు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లెనిన్కుమార్ వెల్లడించారు. -
చుక్కల దుప్పి మృతి..
దొరవారిసత్రం: మండలంలోని కల్లూరు గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి ఓ చుక్కల జింక మంగళవారం వచ్చింది. దీనిపై కుక్కలు దాడి చేశాయి. గ్రామస్తులు గుర్తించి జింకను రక్షించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఎస్ఓ కోటేశ్వరావు, బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి గాయపడిన జింకను దొరవారిసత్రం పశువైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో జింక మృతిచెందిందని ఫారెస్టు అధికారులు తెలిపారు. పోస్టుమర్టం నిర్వహించిన అనంతరం జింకను ఖననం చేశారు. -
కుక్కల దాడిలో చుక్కల జింక మృతి
పాతపట్నం: అడవి నుంచి తప్పిపోయి జనారణ్యంలోకి వచ్చిన ఓ చుక్కల (కృష్ణజింక)జింకను పాతపట్నం ఆల్ ఆంధ్రా రోడ్డు వద్ద కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు దాహార్తి తీర్చుకోవడానికి జోగికొండ దిగువకు రావడంతో కుక్కలు చూసి వెంబడించడంతో స్థానికులు చూసి, కుక్కలను తరిమికోట్టారు. అప్పటికే జింకకు మెడపై, కాళ్లకు గాయాలున్నాయి. ప్రాణాలతో ఉండడంతో అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి జింకను ఆటోలో తమ కార్యాలయానికి తీసుకు వెళ్లి వైద్యం అందించారు. అయితే ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అటవీ శాఖ రేంజర్ ఎం.వి.ఎస్ సోమశేఖర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ కార్యాలయం సమీపంలో జింకను పశుశాఖ ఏడీ ఎం.రవికృష్ణ పంచనామా చేసి, పోస్టుమార్టం అనంతరం ఖననం చేశామని ఫారెస్టు సెక్షన్ అధికారి బి.రామమూర్తి తెలిపారు. పారెస్టు బీట్ అధికారి జి.కృష్ణప్రసాద్, గార్డు ఎస్.కృష్ణారావు పాల్గొన్నారు. -
ఓటేయమంటున్న ధోతీ కట్టుకున్న 'లేడి'
బెంగాల్ లోని నదియా జిల్లాలో ఓటు వేయడాన్ని ప్రొత్సహించేందుకు ఎన్నికల సంఘం వినూత్న పద్థతిని ఎంచుకుంది. నదియాలో 67 హెక్టేర్ల విస్తీర్ణంలో బేతువాదహారి అభయారణ్యం ఉంది. అందులో మచ్చల లేడి చాలా ఫేమస్. అందుకే ఆ జిల్లాలో ఓటింగ్ ను ప్రోత్సహించేందుకు మచ్చల లేడిని ఎంచుకుంది. ధోతీ కట్టిన మచ్చల లేడి బొమ్మ ఇప్పుడు జిల్లా అంతటా దర్శనమిస్తోంది. దానిని మృగబాబు అని పేరు పెట్టి, మృగబాబు చేత ప్రజలను ఓటేయమని అడిగే పోస్టర్లు వెలిశాయి. జిల్లాలో రెండు లోకసభ నియోజవకర్గాలున్నాయి. అవి కృష్ణ నగర్, రాణాఘాట్. ఈ రెండింటిలో దాదాపు 37 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గాల్లో మే 12 న పోలింగ్ జరుగుతుంది.