లోకాయుక్తకు ఎస్.ఆర్.నాయక్
పేరు సిఫార్సు చేసిన సీఎం
బెంగళూరు: లోకాయుక్త న్యాయమూర్తి స్థానానికి నివృత్త న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ మాత్రం మండిపడుతోంది. వివరాలు...లోకాయుక్త నియామకానికి సంబంధించి శుక్రవారం సాయంత్రం కుమారకృపా అతిథి గృహంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, స్పీకర్ కాగోడు తిమ్మప్ప, విధానపరిషత్ సభాపతి శంకరమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివృత్త న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయర్ పేరును లోకాయుక్త పదవికి సిఫార్సు చేశారు. అయితే జగదీష్ శెట్టర్ మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నివృత్త న్యాయమూర్తి విక్రమ్‌జిత్ సేన్ పేరును సిఫార్సు చేయాల్సిందిగా సూచించారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆ సూచనను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో జగదీష్ శెట్టర్ ఈ సభలో తీవ్రఅసహనం వ్యక్తం చేశారు.
‘ఏకపక్షంగా మీరే నిర్ణయాలు తీసుకునేటట్లయితే మమ్మల్ని ఈ సభకు ఎందుకు పిలిచినట్లు? మీరే ఏదో ఒక పేరును సిఫార్సు చేస్తే సరిపోయేది కదా? అయినా కేవలం పేరుకు మాత్రమే ప్రతిపక్షాలను పిలిచేలా ఉంటే అసలు మమ్మల్ని ఇలాంటి సమావేశాలకు పిలవకండి. ప్రతిపక్షాల నిర్ణయానికి గౌరవమంటూ లేదా’అని మండిపడ్డారు. దీంతో సిద్ధరామయ్య సైతం ‘నేను చెప్పినదే తుది నిర్ణయం,’ అంటూ సమావేశం నుండి వెళ్లిపోయినట్లు సమాచారం.