ఎన్నికలపై దేశ భవిష్యత్తు ఆధారపడింది
విజయపుర, న్యూస్‌లైన్ : దేశ భవిష్యత్తు ఈ ఎన్నికలపై ఆధారపడి ఉందని, సమర్థుడైన నేతను దేశ ప్రధానిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓటర్లకు యలహంక ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కేంద్రంలో యూపీఏ పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు.
చిక్కబళ్లాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బి.ఎన్.బచ్చేగౌడకు మద్దతుగా చన్నరాయణపట్టణ పంచాయతీ పరిధిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడు ప్రజా సమస్యలపై ఏ నాయకుడూ స్పందించలేదని అన్నారు. గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. నరేంద్ర మోడిని ప్రధానిగా చేసేందుకు బచ్చేగౌడను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అభ్యర్థి బచ్చేగౌడ మాట్లాడుతూ.. పథకాలతో పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయికి నాసిరకం బియ్యం ఇచ్చే బదులు ఆ బియ్యాన్ని పండించే రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే దేశం ఏనాడో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. పంట పండించేందుకు సాగునీరు లేదు. కనీసం బోరు నీరు వాడుకుందామన్నా విద్యుత్ సౌకర్యం లేక అన్నదాత అప్పుల్లో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకి ఏనాడూ రైతుల కష్టాలు గుర్తుకు రాలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రం ఎత్తినహొళె పథకం గుర్తుకు వచ్చి శంకుస్థాపన చేశారని, అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఒనగూరే లాభం ఏదీ లేదని అన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్‌కు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీ చేరారు. కార్యక్రమంలో జెడ్పీసభ్యుడు రాజన్న, మాజీ ఎమ్మెల్యే జి.చంద్రప్ప, ఏపీఎంపీ మాజీ అధ్యక్షుడు గోపాలగౌడ, నేతలు నాగరాజు, నాగరాజ గౌడ పాల్గొన్నారు.