ముంగిసతో ఫోటోకి ఫోజులు.. నటిపై కేసు నమోదు
Bengali actress Srabanti Chatterjee: బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. గొలుసుతో కట్టేసి ఉన్న ముంగిసతో ఫోటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో చేయడంతో ఆమెపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్లు 9, 11, 39, 48ఏ, 49, 49ఏ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించి జంతువులను అక్రమంగా పట్టుకోవడం, రవాణా చేయడం, స్వాధీనం చేసుకున్నందుకు ఛటర్జీపై కేసులు నమోదు చేయబడ్డాయి. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ సెల్, డేటా మేనేజ్మెంట్ యూనిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని స్రబంతికి నోటీసులు పంపారు.
అయితే వ్యన్య ప్రాణుల సంరక్షణ చట్టం గురించి తనకు అంతగా తెలియదని ఆమె అధికారులకు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె అధికారుల ముందు హాజరుకాలేదు. ఈ విషయంపై స్రబంతిని మీడియా ప్రశ్నించగా..‘ఈ కేసు విచారణలో ఉది. అందుల్ల నేను ఏమి మాట్లాడలేను’అని బదులిచ్చారు. ఇక స్రబంతి ఛటర్జీ వ్యక్తిగత న్యాయవాది ఎస్కే హబీబ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. ‘స్రబంతి ఇంకా అధికారులను కలవలేదు. వారిని కలిసిన తర్వాత మాత్రమే స్పష్టమైన వివరణ ఇవ్వగలం.కచ్చితమైన ఆరోపణలను తెలుసుకోవడానికి మేము త్వరలో అధికారులను కలుస్తాం’అని చెప్పారు.
ఈ కేసు గురించి ఓ సీనియర్ అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణులను బంధించడం ఒక్కటే నేరం కాదు, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల ఇతరులు తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే స్రబంతిపై కేసు నమోదైంది. దర్యాప్తుకు ఆమె సహకరించి, వన్యప్రాణుల సంరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్తతుగా నిలవావాలని కోరారు.