శ్రావణం.. శుభకరం..
శ్రావణం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో అన్ని రోజూలూ శుభకరమే.. ఆదివారం భానుడికి, సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం అయ్యప్పకు, గురువారం దక్షిణామూర్తికి, శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజులు. శ్రావణమాసంలో ఆయా రోజుల్లో ఆయా దేవతలను పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. పూజలు, వ్రతాలు చేస్తారు. ఉపవాసాలుంటారు. ఈనెలలో మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, సూర్యషష్టి, వరలక్ష్మీవ్రతం, రాఖీపౌర్ణిమ, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి పర్వదినాలు వస్తాయి. శ్రావణ బహుళ అమావాస్య (పోలాల అమావాస్య)తో శ్రావణమాసం ముగుస్తుంది. ఈనెలలో దైవధ్యానంతో గడపాలని, దేవాలయాల్లో అర్చనలు చేయాలని వేదపండితులు సూచిస్తున్నారు.
సోమవారం
ముక్తిప్రదాత శివుడికి ప్రీతికరమైన రోజిది. సోమవారం శివుడిని పూజిస్తే శివకటాక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన శివుడిని పంచామృతాలతో అభిషేకించి బిల్వపత్రం సమర్పిస్తే ఆయుష్షు పెరుగుతుందని, ఆరోగ్యం సిద్ధిస్తుందన్నది భక్తుల నమ్మకం. సోమవారం శైవ క్షేత్రాల్లో మహాన్యాస పూర్వక అభిషేకాదులు నిర్వహిస్తారు.
మంగళవారం
అభయమిచ్చే ఆంజనేయుడు.. సకల విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడు.. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్యేశ్వరుడు.. మంగళవారమే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో ఈ రోజు ఆయా దేవతలను ఆరాధిస్తే.. వారు శుభాలను ప్రసాదిస్తారన్నది భక్తుల విశ్వాసం. హనుమంతుడికి చందన లేపనం ఎంతో ఇష్టం. ఆయనకు చందన లేపనం చేసి, తెల్ల జిల్లేడు పూలు, తమలపాకులు, మినప గారెల మాలతో అలంకరించి, పూజిస్తే శుభాలు కలుగుతాయని అర్చకులు పేర్కొంటున్నారు. విఘ్నేశ్వరుడికి అభిషేకం, ఎర్రని పూలతో అర్చన చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే కుజదోష నివారణ అవుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు.
బుధవారం
హరిహర సుతుడైన అయ్యప్పను బుధవారం కొలుస్తారు. శ్రావణ బుధవారాల్లో అయ్యప్పపూజ విశేష ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతున్నారు. సర్వకార్య అనుకూలత, శివకేశవుల కటాక్షం పొందేందుకు అయ్యప్పకు అభిషేకం చేయాలని సూచిస్తున్నారు. అటుకులు, బెల్లం కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అయ్యప్ప అనుగ్రహం పొందవచ్చంటున్నారు.
గురువారం
ఈ రోజు దక్షిణామూర్తిని, సాయిబాబాను కొలుస్తారు. అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పిస్తే దక్షిణామూర్తి స్వామివారు సంతృప్తిచెందుతారని, పచ్చి శెనగల దండను సమర్పిస్తే కరుణా కటాక్షాలను వర్షిస్తాడని చెబుతారు. ఈ పూజలతో విద్యార్థుల్లో మేధోసంపత్తి ఇనుమడిస్తుందని, వాక్శుద్ధి ప్రాప్తిస్తుందని పేర్కొంటున్నారు.
శుక్రవారం
శ్రావణ శుక్రవారం వ్రతమాచరి స్తే అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసం లో ప్రతి శుక్రవారం కుంకుమార్చన, ఎర్రని పుష్పాలతో కలిపి అల్లిన మల్లెపూల మాలను అమ్మవారికి సమర్పించడం అత్యంత శుభకరం. మంగళగౌరి వ్రతం, మహాలక్ష్మి వ్రతం ఆచరించేవారికి శ్రావణ శుక్రవారం విశిష్టమైనది. ఈ వ్రతాలు ఆచరిస్తే రుణవిమోచన జరిగి లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.
శనివారం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని కొలిస్తే కోరిన వరాలిస్తాడన్నది భక్తుల విశ్వాçÜం. ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం. స్వామివారికి పుష్పార్చన, తులసీదళాల మాల సమర్పిస్తే శుభం
కలుగుతుందని పండితులంటున్నారు.
ఆదివారం
ప్రత్యక్ష భగవానుడు ఆదిత్యుడికి ప్రీతికరమైన రోజిది. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకు భక్తితో నమస్కరిస్తే కోరిన కోరిక లు తీరుస్తాడని, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.
నాగుల పంచమి
సర్వదోషాలు, సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. మహిళలు, యువతులు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో పుట్టలలో పాములకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. వెండితో నాగప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు. పుట్టలో పాలు పోసి వచ్చాక సోదరీమణులు సోదరులకు పుట్ట నుంచి తీసుకువచ్చిన పాలతో కళ్లను కడుగుతారు. సోదరులు సోదరీమణుల కాళ్లకు మొక్కి ఆశీస్సులు పొందుతారు.
మంగళగౌరి వ్రతం
్రÔ>వణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం జరుపుకుంటారు. సంపద, సౌభాగ్యాల కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహానంతరం మొదటి సంవత్సరం పుట్టింట్లో, తర్వాతి నాలుగేళ్లు మెట్టింట్లో ఈ వ్రతాన్ని ఆచరించాలని వేద పండితులు చెబుతున్నారు. వివాహ యోగాన్ని అర్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించేవారి కోరిక ఈడేరుతుందన్నది భక్తుల నమ్మకం. పసుపుతో, బంగారం, వెండితో గౌరమ్మను చేసి పూజిస్తే సుఖసంపదలు, ధనదాన్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. పేదలు మొదలు సంపన్నుల వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తయిదువులకు పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.
వరలక్ష్మీవ్రతం
నిత్య సౌభాగ్యం కోసం మహాలక్ష్మిని ప్రార్థిస్తూ సుహాసినులు చేసే వ్రతమిది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుతారు.
రక్షాబంధన్
శ్రావణ పౌర్ణమిని రాఖీపౌర్ణమి, రక్షా బంధన్, జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. సోదరులకు ఆయురారోగ్యా లు, ఐశ్వరాలు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ అక్కాచెల్లెళ్లు రక్షలు కడతారు. యజ్ఞోపవీత ధారణకు అధికారం ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు.
శ్రీకృష్ణాష్టమి
శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీ కృష్ణ జయంతిని జన్మాష్టమిగా జర‡ుపుకుంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున పల్లె, పట్టణం తేడా లేకుండా శ్రీకృష్ణుడిని పూజించి, ఉట్టి కొడతారు. చిన్నారులను గోపికలుగా, కృష్ణులుగా అలంకరిస్తారు. పోటీలు కూడా నిర్వహిస్తారు.