‘రామ’ బాణం పని చేసింది!
శ్రీరామ్ సలహాలతో చెలరేగిన ఆసీస్
విజయంలో కీలక పాత్ర పోషించిన భారత మాజీ ఆటగాడు
పుణే: అంతర్జాతీయ క్రికెటర్‌గా శ్రీధరన్ శ్రీరామ్‌కు పెద్దగా గుర్తింపేమీ లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దాదాపు పది వేల పరుగులు చేసినా... భారత్ తరఫున నాలుగేళ్ల వ్యవధిలో ఆడింది కేవలం 8 వన్డేలు. వీటిలో 81 పరుగులే చేయగలిగాడు. స్పిన్నర్‌గా కూడా అతనేమీ మురళీధరన్, షేన్ వార్న్‌ల తరహాలో వందల కొద్దీ వికెట్లు తీసిన బౌలర్ కాదు. తీసింది కేవలం 9 వికెట్లే. కానీ తనకున్న పరిజ్ఞానానికి తోడు భారత దేశవాళీలో సాధించిన అపార అనుభవాన్ని అతను కలబోసి ఆస్ట్రేలియాకు అద్భుతాన్ని అందించాడు.
పుణే టెస్టు విజయంలో శ్రీరామ్ పోషించిన పాత్ర ఎంతో కీలకం. టీమ్ స్పిన్ కన్సల్టెంట్‌గా చాలా కాలంగా పని చేస్తున్న శ్రీరామ్ సామర్థ్యం ఆసీస్‌కు ఇప్పుడు పనికొచ్చింది. ముఖ్యంగా ఈ టెస్టులో 12 వికెట్లు తీసిన ఒకీఫ్ తన ప్రదర్శనకు శ్రీరామ్ కారణంగా వెల్లడించాడు. ‘ఒకీఫ్ చేసిన సన్నాహాలే అతడికి ఈ ఫలితాన్ని అందించాయి. టెస్టు జరుగుతున్న సమయంలో అతని బౌలింగ్‌లో నేను ఒక్కసారిగా ఏమీ మార్పు చేయలేదు. ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ను మార్చుకోవడమే ఒకీఫ్ విజయ రహస్యం. భారత్‌లాంటి చోట ఒక వ్యూహం పని చేయకపోతే మరో వ్యూహంతో సిద్ధంగా ఉండాలి. భిన్నంగా ప్రయత్నించడానికి కూడా అతను సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాడు. మాకు రెండేళ్లుగా పరిచయం ఉంది. బౌలింగ్ విషయంలో తన పరిమితులు ఏమిటో అతనికి బాగా తెలుసు’ అని శ్రీరామ్ విశ్లేషించాడు.
మంచి గుర్తింపు...
ఇటీవలి కాలంలో ప్రముఖ మాజీ ఆటగాళ్లే ఎక్కు వగా వివిధ జట్లకు కోచ్‌లు, సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా వారి మాటల్లో బలం, వారికి ఆటగాళ్లు ఇచ్చే గౌరవం సహజంగానే ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటి స్థితిలో వ్యక్తిగతంగా పెద్దగా పేరు ప్రతిష్టలు లేని వ్యక్తి ఆస్ట్రేలియాలాంటి అగ్రశ్రేణి టీమ్‌తో కలిసి పని చేయడం అంత సులువు కాదు. పైగా ఆసీస్ ఆటగాళ్లు సహజంగానే దురుసుగా ఉంటారు. అయితే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనే తాను పని చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. ‘మనల్ని గౌరవించేందుకు పేరు ప్రఖ్యాతులే ముఖ్యమని నేను భావించడం లేదు. నేను ఏదైనా అర్థవంతంగా మాట్లాడితే వారు దానిని జాగ్రత్తగా విని స్వీకరిస్తారు. అనవసరపు చెత్త మాట్లాడితే ఆటగాళ్లు పట్టించుకోరు. వారితో కలిసిపోయేందుకు నాకు కాస్త సమయం పట్టిన మాట వాస్తవం. నేను చేసిన సూచనలను వారు మెల్లగా నెట్స్‌లో పాటించడం, దాని ఫలి తాలు కనిపించడంతో అంతా సర్దుకుంది. సమస్య ఏదైనా నేను ఆయా ఆటగాడి దగ్గరికి వెళ్లి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కేవలం స్పిన్నర్లతోనే కాకుండా జట్టు మొత్తంతో మా ట్లాడే స్వేచ్ఛను నాకు ప్రధాన కోచ్ ఇచ్చారు’ అని శ్రీరామ్ చెప్పుకున్నాడు.
కఠోర సాధన...
భారత్‌లో సిరీస్ అంటే ఏ విదేశీ జట్టుకైనా అంత సులువు కాదని, అందుకే దుబాయ్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీరామ్ వెల్లడించాడు. తొలి టెస్టు విజయం వెనక చాలా శ్రమ ఉందని ఆయన చెప్పాడు. ‘ఎలాంటి వ్యతిరేక ఫలితం కోసమైనా మానసికంగా సిద్ధంగా ఉంటే పరాజయాన్ని కూడా స్వీకరించే ధైర్యం వస్తుంది. ఏదైనా చిన్న అవకాశం కలిసొచ్చినా దానిని అందుకోవడం అవసరం. దుబాయ్‌లో మేం వేర్వేరు పిచ్‌లపై ప్రాక్టీస్ చేశాం. టర్నింగ్, స్లో, లో పిచ్‌లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాం. ఎలాంటి వికెట్ ఎదురైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని భావించాం. అయితే పుణేకంటే చెత్త పిచ్‌లను గతంలోనూ నేను చూశాను’ అని శ్రీరామ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికైతే నంబర్‌వన్ టీమ్పైతో ఘన విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించడంలో శ్రీరామ్ సూచనలు అద్భుతంగా పని చేశాయనడంలో సందేహం లేదు. ఇదే జోరు సిరీస్‌లోని మిగతా టెస్టులలో కూడా కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరం.
ఆటగాడి నుంచి కోచ్‌గా...
తమిళనాడు తరఫున సుదీర్ఘ కాలం రంజీల్లో ఆడిన శ్రీరామ్ ఆ తర్వాత అస్సాం, మహారాష్ట్ర, గోవాలాంటి జట్లకు కూడా ప్రాతినిధ్యం వహిం చాడు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో చేరి నిషేధం ఎదుర్కొని, ఆ తర్వాత బయటకు వచ్చాక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ ఆరంభంలో శ్రీరామ్ అడిలైడ్‌లోని ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడమీలో శివ్‌సుందర్ దాస్, మొహమ్మద్ కైఫ్‌లతో కలిసి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. స్టార్క్, హారిట్జ్లాంటి ఆసీస్ ఆటగాళ్లతో అతను కలిసి ఆడాడు. ప్రతిభకు ప్రోత్సాహంగా ‘బోర్డర్ గావస్కర్ స్కాలర్షిప్’ను అందుకున్న తొలి ఆటగాడు శ్రీరామ్ కావడం విశేషం. నాటి ఆసీస్ అనుబంధం కోచ్ రూపంలో ఇప్పటికీ కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం తొలిసారి ఆసీస్ ‘ఎ’ జట్టుతో కలసి పనిచేసిన అతను ఆ తర్వాత సీనియర్ జట్టుతో చేరాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీరామ్ అనుభవాన్ని గుర్తించిన క్రికెట్ ఆస్ట్రేలియా తమ కన్సల్టెంట్‌గా అతడిని ఎంచుకుంది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కూడా అత ను పని చేశాడు.