శ్రీమఠం..నీటి కష్టం
– పుణ్యస్నానాలకు నీరు కొరత
– మూతపడిన మరుగుదొడ్లు
– భక్తులకు తప్పని ఇబ్బందులు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఆదివారం.. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు, కాలకత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నీరు లేక మరుగుదొడ్లు మూతపడడంతో మహిళా భక్తులు నరకయాతన అనుభవించారు. క్షేత్రంలోని నదీతీరాన రెండు సులభ్ కాంప్లెక్స్‌లు, రంగసభాంగన లాక్ రూమ్‌లో స్త్రీ, పురుషుల మరుగుదొడ్లు, శ్రీమఠం ప్రధాన ద్వారంలోని మరుగుదొడ్ల సముదాయాలు నిర్మించారు. ఆదివారం సెలవు కావడంతో వేలాదిగా భక్తులు శ్రీమఠానికి తరలివచ్చారు. నీటి సాకుతో మరుగుదొడ్లు మూత పడడంతో వేలాది మంది భక్తులు కష్టాలు ఎదుర్కొన్నారు.
పుణ్యస్నానం దూరం..
వర్షాభావంతో తుంగభద్ర నదిలో నీరు అడుగంటింది. ఆరాధనోత్సవాలు దష్టిలో ఉంచుకుని శ్రీమఠం అధికారులు నదీతీరాన షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఉత్సవాలు ముగిసిన తర్వాత దీనిని పట్టించుకోలేదు. భక్తులు రాళ్లలో రప్పలు దాటుకుని దూరంలో ఉన్న నది మడుగుల్లో మునకలు సాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వద్ధులు మాత్రం సుదూరం పోలేకపోతున్నారు. అధికారులు కనీసం షవర్బాత్కు నీరు వదిలితే వేలాది మంది భక్తులు సంతోషిస్తారు.
కనికరించాలి : పుల్లమ్మ, కషాపురం
వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. నదిలో నీళ్లు లేక స్నానాలకు పడరాని పాట్లు పడుతున్నారు. శ్రీమఠం అధికారులు షవర్బాత్కు నీరు వదలడం లేదు. కారణంగా భక్తుల పుణ్యస్నానాలకు కష్టమైంది. మఠం అధికారులు కనికరిస్తే బాగుండు.
ఇదేమి చోద్యం : విశ్వామిత్ర, గుల్బర్గా
కాలకత్యాలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంతగా భక్తులు బాధ పడుతున్నా శ్రీమఠం అధికారులు చోద్యం చూడటం శోచనీయం. పేరుగాంచిన క్షేత్రంలో నీటి కొరత కారణంగా శౌచాలయాలు మూతవేశారంటే సిగ్గుగా ఉంది. ఇకనైనా మఠం అధికారులు మేల్కోవాలి.