శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు భేష్
– గవర్నర్ నరసింహన్ కితాబు
– రూ.300 టికెట్ల క్యూ సందర్శన
సాక్షి, తిరుమల:
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయని తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.300 టికెట్ల క్యూను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తుల కోసం టీటీడీ క్రమంగా మెరుగైన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఆలయంలో తోపులాటలు లేకుండా కొత్తగా హుండీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తాను కూడా అదే హుండీలోనే కానుకలు సమర్పించానన్నారు. రూ.300 టికెట్ల క్యూను అమలు పక్కాగా సాగుతోందని, భక్తులకు అవసరమైన పాలు, లగేజీ భద్రత కేంద్రాలు ఉన్నాయన్నారు. అంతకుముందు ఆలయంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు గవర్నర్‌కు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
వేదాలు సమాజ హితానికి ఉపయోగపడాలి
– వేద విశ్వవిద్యాలయం అధికారులు గవర్నర్ నరసింహన్ సమీక్ష
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి) /తిరుచానూరు :
వేదాలు సమాజ హితానికి తోడ్పడాలని ఏపీ, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాలు సమాజానికి ఉపయోగపడాలని, సామాన్యుడికి అర్థమయ్యేరీతిలో వేదసారాన్ని వివరించాలని సూచించారు. ఆదిశగా వేదిక్ యూనివర్సిటీలో పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. ఆ లక్ష్యంతోనే వేదిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. అయితే లక్ష్యసాధనలో ఆశించిన ఫలితాలు దక్కలేదన్న అసంతప్తి ఉందన్నారు. యూనివర్సటీలోని అధ్యాపకులకు సంస ్కతంపై పట్టు అవసరమన్నారు. అపుడే వేదాలపై లోతైన అధ్యయనం వీలవుతుందన్నారు. వేదాల్లో జ్యోతిష్యం, సైన్స్, ఖగోళ శాస్త్రం, అంతరిక్షశాస్త్రం తదితర అన్ని శాస్త్రాలకు సంబంధించిన అంశాలు పొందుపరచి ఉన్నాయన్నారు. వాటిని వెలికితీసి సమాజానికి ఉపయోగ పడేలా చేయాలని చెప్పారు. అనంతరం అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు సత్యం, ధర్మం ఆచారించాలని కోరారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో వీసీ కేఈ.దేవనాథన్, రిజిస్ట్రార్ జీఎస్ఆర్ కష్ణమూర్తి పాల్గొన్నారు.
పద్మావతీ అమ్మవారి సేవలో..
గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ దంపతులు ఆదివారం మధ్యాహ్నం తిరుచానూరు ఆలయంలో కుంకుమార్చన సేవలో పాల్గొని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేనంతగా హైదరాబాదులో కురిసిన వర్షంతో రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయన్నారు. అక్కడి ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టిందన్నారు. మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైతం లోతట్టు ప్రాంతాలు, చెరువుల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ అధికారులు బాగా చేస్తున్నట్లు తెలిపారు.